ఏఓబీలో హైఅలర్ట్‌ | High alert In AOB‌ | Sakshi
Sakshi News home page

ఏఓబీలో హైఅలర్ట్‌

Published Tue, Apr 6 2021 2:40 AM | Last Updated on Tue, Apr 6 2021 2:41 AM

High alert In AOB‌ - Sakshi

సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల ఘటనతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఏపీ పోలీస్‌ యంత్రాంగం హైఅలర్డ్‌ ప్రకటించింది. దండకారణ్యంలో పథకం ప్రకారం మూడు వైపులా చుట్టుముట్టిన మావోయిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో 24 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణలు ఉన్నారు. మరోవైపు.. కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్‌ను బందీగా పట్టుకున్నట్లు మావోయిస్టులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌గా స్పందించింది. కేంద్ర నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. 

ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్‌ జరిగిన బీజాపూర్‌–సుక్మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలమైన ఏటపాక సరిహద్దుకు ఘటన ప్రాంతం దగ్గర కావడంతో ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడపడుతున్నాయి. 

అప్రమత్తం చేశాం
ఛత్తీస్‌ఘఢ్‌ ఘటన అనంతరం కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాల ఆదేశాలతో ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) ప్రాంతంలోని ఏజెన్సీ మండలాల్లో పోలీసులను అప్రమత్తం చేశాం. ఘటన జరిగిన ప్రాంతం మన రాష్ట్రంలోని విలీన మండలానికి సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదు. అయినప్పటికీ ఏఓబీ ప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేశాం. పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలోను ఏజన్సీ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. మన గ్రేహౌండ్స్‌ బలగాలు, నిఘా వర్గాలు పటిష్ట వ్యూహంతో వ్యవహరిస్తున్నాయి. 
– డీజీపీ డి. గౌతమ్‌ సవాంగ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement