
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆలయాల వ్యవహారంపై పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే మతపరమైన సంస్థలు, ఆలయాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ మరిన్ని పక్కా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేవాలయాలపై ఈ రకమైన ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు గుర్తించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పెట్రోలింగ్, బందోబస్తులతో విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అర్చకులు, ఆలయ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకునేందుకు శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు ఫోన్ ద్వారా చెప్పాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత చర్యలు పర్యవేక్షించాలని, నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. దేవాలయాల ఘటనలపై పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశామని, వాటి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా ఆలయాలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మిగిలిన వాటిలోనూ త్వరితగతిన ఏర్పాటు చేస్తామన్నారు.
‘రామతీర్థం’ నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం!
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కేసు దర్యాప్తునకు సంబంధించి డీఐజీ కేఎల్ కాంతారావు ఆదివారం విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి, ఇతర ముఖ్య అ«ధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.