అనాథ శరణాలయాల చిన్నారులతో డీజీపీ గౌతం సవాంగ్ మాటామంతీ
సాక్షి, అమరావతి: అనాథ బాలల సంరక్షణ సమాజంలో అందరి బాధ్యతని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా పలు అనాథ శరణాలయాలకు చెందిన బాలికలు ఆయనకు సోమవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి కంటి గాయాన్ని గమనించిన ఆయన ఏమైందని వాకబు చేశారు. గతంలో విజయవాడలో ఓ ఇంట్లో పనిచేస్తుండగా యజమానురాలు కొట్టడంతో కంట్లో గాయమైందని ఆ బాలిక తెలిపింది. అప్పట్లో 1098కు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు ఆ బాలికను రక్షించి జిల్లా పునరావాస కేంద్రంలో చేర్పించారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డీజీపీకి తెలిపారు.
రమ్య కుటుంబాన్ని వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు
గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. రమ్య కుటుంబ సభ్యులు డీజీపీ గౌతం సవాంగ్‌ను మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. పోలీసులు తక్షణం స్పందించి నిందితుడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కాగా తాము డబ్బుకు అమ్ముడుపోయామని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండడం తమకు తీవ్ర మానసిక వ్యథ కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ రమ్య కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment