బాబుకు లీగల్‌ నోటీసు | Gautam Sawang Fires On Fake News Of And Yellow Media TDP Leaders | Sakshi
Sakshi News home page

బాబుకు లీగల్‌ నోటీసు

Published Thu, Oct 14 2021 2:55 AM | Last Updated on Thu, Oct 14 2021 7:28 AM

Gautam Sawang Fires On Fake News Of And Yellow Media TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: డ్రగ్స్‌ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు, పోలీస్‌ శాఖ ఎన్నిసార్లు తేల్చి చెప్పినా విపక్ష నేతలు పట్టించుకోకుండా పదేపదే అవే అబద్ధాలను వల్లించడం, అనుకూల మీడియాలో అవాస్తవాలను ప్రచురించడం, తిరిగి వాటిని ప్రచారంలోకి తెస్తున్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో డీజీపీ న్యాయాస్త్రాన్ని సంధించారు. రాష్ట్రం, పోలీస్‌శాఖ ప్రతిష్టను మసకబార్చవద్దని సామరస్య పూర్వకంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయకపోవడంతో న్యాయబద్ధంగానే దీన్ని ఎదుర్కోవాలని, కుట్రలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించి లీగల్‌ నోటీసులు జారీ చేశారు.

అనివార్య పరిస్థితుల్లోనే..
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకుపోలీసు శాఖ సన్నద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడంతోపాటు పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగాలపై ‘న్యాయ అస్త్రాన్ని’ ప్రయోగించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర పార్టీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు డీజీపీ సవాంగ్‌ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే లీగల్‌ నోటీసులిచ్చినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతతోపాటు మీడియా సంస్థలపై డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఇలా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడం దేశంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

దేశంలో ఇదే తొలిసారి...
సాధారణంగా సీఎస్, డీజీపీ స్థాయి అధికారులు ఇలా ప్రతిపక్ష నేతకు లీగల్‌ నోటీసులు జారీ చేయాల్సిన అనివార్యత తలెత్తదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అనివార్యంగా న్యాయాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. విపక్ష నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారి అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తోంది. టీడీపీ నేతలు తిరిగి వాటినే వల్లె వేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన దాఖలాలు లేవు. గుజరాత్‌లో కేంద్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు జప్తు చేసిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఏపీకి ముడిపెడుతూ విపక్షాలు దుష్ప్రచారానికి తెగించాయి.

ఆ హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు విస్పష్టంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు, టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాతో బురద చల్లుతూనే ఉన్నారు. డీజీపీ సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబులోగానీ ఆ రెండు పత్రికల యాజమాన్యాల్లో గానీ ఏమాత్రం మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేనందున న్యాయ పోరాటం ద్వారానే ఈ కుట్రలను బహిర్గతం చేయాలని డీజీపీ నిర్ణయించుకుని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు, ఎడిటర్లు, పాత్రికేయులకు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలపై బేషరతుగా క్షమాపణలు చెప్పి అదే విషయాన్ని ఆ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాలని  నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

రాజకీయ లబ్ధి కోసమే బురద
రాజకీయ లబ్ధి కోసం యావత్‌ పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు విపక్ష టీడీపీ కుతంత్రాలకు తెగిస్తోంది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖపై దుష్ప్రచారానికి పాల్పడుతోంది. టీడీపీ అనుకూల మీడియా దీనికి కొమ్ము కాస్తోంది. నిరాధార ఆరోపణలను ప్రముఖంగా ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ రవాణా – గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌ సీఎం ఇంటి సమీపంలోని సంస్థలదే’.. ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’ .. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’... ఇలా పలు రకాలుగా చంద్రబాబు, లోకేశ్‌ నిరాధారణ ఆరోపణలు చేశారు. వాటిని అవే శీర్షికలతో ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ‘జగన్‌ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి’.. ‘డ్రగ్స్‌ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు: చంద్రబాబు ధ్వజం’ అంటూ విపక్ష నేత చేసిన అసత్య ఆరోపణలను ఆంధ్రజ్యోతి  ఉద్దేశపూర్వకంగా ప్రముఖంగా ప్రచురించింది. 

కుట్రలపై జాతీయస్థాయిలో చర్చ
పోలీస్‌ శాఖ ప్రతిష్టను పరిరక్షించేందుకు డీజీపీ సవాంగ్‌ న్యాయపరమైన చర్యలకు సమాయత్తమవడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అనివార్యంగా అంతటి నిర్ణయం తీసుకునేందుకు పురిగొల్పిన పరిస్థితులు ఏమిటన్న దానిపై దేశవ్యాప్తంగా అంతా దృష్టి సారించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన మీడియా సంస్థలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు సహకరిస్తుండటం పట్ల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇంటి పక్కన సంస్థే హెరాయిన్‌ దిగుమతి చేయించిందని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం, టీడీపీ అనుకూల మీడియా దానికి వత్తాసు పలుకుతూ దుష్ప్రచారం చేస్తుండటాన్ని దేశమంతా గుర్తించింది. ఈ కుట్రలను ఎండగట్టేందుకు డీజీపీ సరైన నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement