సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యుత్తరమిచ్చారు. చట్టప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని కోరారు. జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో వాస్తవాలను వివరిస్తూ ఈ మేరకు డీజీపీ, బాబుకు లేఖ రాశారు. దాడికి పాల్పడ్డ ప్రతాప్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని విచారణలో తేలిందన్నారు. చంద్రబాబు ఆరోపించినట్లుగా ఈ ఘటనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, మదనపల్లె డిఎస్పీ దర్యాప్తు వేగవంతం చేశారని డీజీపీ పేర్కొన్నారు. (చదవండి: అధికారమైనా.. ప్రతిపక్షమైనా టీడీపీ వారికి దూరమే)
అదే విధంగా.. గొడవకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి లేఖలో వివరించారు. ‘‘సెప్టెంబరు 27న 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కారులో వెళ్తున్న ప్రతాప్ రెడ్డికి, తోపుడు బండి వ్యక్తికి వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న రామచంద్ర ఆ వివాదంలో కలుగజేసుకుని గొడవపడ్డారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి, రామచంద్రల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే స్థానికులు కలుగజేసుకుని ఇద్దరినీ వేరు చేశారు. ప్రతాప్‌రెడ్డితో జరిగిన గొడవలో రామచంద్రకు గాయాలయ్యాయి. వెంటనే రామచంద్రను కొత్తకోటకు వైద్యం కోసం తరలించారు. రామచంద్ర మద్యం మత్తులో ఉన్నారని మెడికల్ ఆఫీసర్ నివేదిక ఇచ్చారు.
మెరుగైన చికిత్స కోసం రామచంద్రను మదనపల్లి ఆస్పత్రికి తరలించాం. వెంటనే ఈ ఘటనపై రామచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సాక్షుల వాంగ్మూలం ,సీసీ కెమెరా ఫుట్ఠేజ్ ల ఆధారంగా, రామచంద్రపై దాడిచేసిన ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టు ముందుంచాం. నిందితుడు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీరు రాసిన లేఖలో వైఎస్సార్ సీపీ నేతలు దాడిచేశారని ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలు వాస్తవం కాదని విచారణలో తేలింది. నిజాలు తెలుసుకోకుండా మీలాంటి వాళ్లు ఇలా ఆరోపణలు చేయడం తగదు. మీ సంతకం తో మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలి. మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే ముందు నా దృష్టికి తీసుకురావాలి’’ అని డీజీపీ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment