కుళ్లిన మృతదేహాన్ని మోసుకొస్తున్న విశాఖ జిల్లా రాంబిల్లి ఎస్‌ఐ అరుణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది (ఫైల్)
సాక్షి, అమరావతి: సేవకు ప్రతిరూపంలా నిలుస్తున్న ఏపీ పోలీసుల తీరుకు ప్రజలు ఫిదా అవుతున్నారు. తాజాగా.. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం సముద్ర తీరంలో కుళ్లిపోయిన అనాథ శవాన్ని భుజాలపై 3 కి.మీ. మోసుకెళ్లిన ఎస్సై వి.అరుణ్‌కిరణ్, సిబ్బందిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీతపాలెం తీరానికి మృతదేహం కొట్టుకు రాగా.. రాంబిల్లి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. తెలిసిన వాళ్లుంటే మృతదేహాన్ని తీసుకెళ్లాలని చుట్టుపక్కల గ్రామాలకు ఎస్సై అరుణ్‌కిరణ్ సమాచారం అందించారు.
మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో మృతదేహం కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఎస్సై అరుణ్‌కిరణ్ ముందుకొచ్చి ఏఎస్సై దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డ్ కొండబాబు సాయంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకుని యలమంచిలి మార్చురీకి తరలించారు.
ఇదిలావుంటే.. ఈ నెల 26న కర్ణాటక నుంచి వచ్చిన 40 మంది భక్తులు శ్రీశైలం అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరారు. భీముని కొలను లోయ వద్దకు వచ్చేసరికి తీవ్రమైన ఎండ కారణంగా దాహంతో అలమటించారు. ఈ స్థితిలో డయల్ 100కు కాల్ చేశారు. శ్రీశైలం వన్‌టౌన్ ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో వెళ్లి భక్తుల దాహార్తి తీర్చి, వారిని క్షేమంగా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లి అందరి మన్ననలు అందుకున్నారు.
ఇటువంటి సేవలే పోలీస్ ప్రతిష్ట పెంచుతాయి
శాంతిభద్రతల నిర్వహణలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు తమదైన రీతిలో అందిస్తున్న ఇటువంటి సేవలు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచుతున్నాయి. విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటామని మరోసారి రుజువు చేసిన రాంబిల్లి, శ్రీశైలం పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
– గౌతమ్ సవాంగ్, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment