Rambilli
-
ప్రాణదాతలు.. 108 ఉద్యోగులు
రాంబిల్లి: సముద్ర కెరటాల ధాటికి నీటిలో మునిగి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని 108 అంబులెన్స్ సిబ్బంది రక్షించారు. వారు సకాలంలో స్పందించి ఆక్సిజన్ అందించడంతో బాధితుడి ప్రాణం నిలిచింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి శివారు వాడపాలెం బీచ్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. యలమంచిలికి చెందిన సీహెచ్ లక్ష్మణ (35), అతని నలుగురు స్నేహితులు శనివారం రాత్రి వాడపాలెం వచ్చారు. అక్కడ రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయం బీచ్‌లో స్నానానికి దిగారు. కెరటాల ధాటికి లక్ష్మణ కొట్టుకుపోతుండగా, పక్కనే ఉన్న స్నేహితులు అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అప్పటికే లక్ష్మణ స్పృహ కోల్పోగా... స్నేహితులు 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహనం టెక్నీషియన్ యడ్ల అప్పలనాయుడు, పైలట్ ఎస్.చంద్రశేఖర్‌రాజు హుటాహుటిన బీచ్‌కు చేరుకున్నారు. బీచ్‌కు సుమారు కిలో మీటరు దూరంలో ఇసుక మాత్రమే ఉండటంతో వాహనం వెళ్లేందుకు సాధ్యం కాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మణను స్ట్రెచర్‌పై ఉంచి స్థానికుల సాయంతో 108 సిబ్బంది అంబులెన్స్ వద్దకు మోసుకొచ్చారు. వెంటనే అతనికి 108లో ఆక్సిజన్ పెట్టారు. సెలైన్ పెట్టి ఎక్కించి మందులు ఇచ్చారు. తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ కోలుకోవడంతో సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. సకాలంలో స్పందించి కిలోమీటరు మేర స్ట్రెచర్‌పై లక్ష్మణను మోసి ఆక్సిజన్, వైద్య సేవలందించి ప్రాణం కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
రెండు కార్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
రాంబిల్లి: కొత్తూరు సమీపంలో శనివారం ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు కార్లు ఢీకొట్టుకున్న ప్రమాదం ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఎస్ఐ పి. రాజారావు తెలిపారు. అన్నవ రం సత్యనారాయణస్వామి దర్శనానికి వెళ్లి వస్తున్న కారు కొత్తూరు సమీపంలోకి రాగానే అచ్యుతాపురం నుంచి యలమంచిలి వైపు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తూ ఢీ కొంది. అన్నవరం నుంచి వస్తున్న కారులో విశాఖ మల్కాపురానికి చెందిన పెళ్లి బృందం ఉంది. ఈ కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కొడుకు, మరో మహిళకు గాయాలయ్యాయి. పెళ్లికొడుకు తండ్రి పిళ్లా శంకరరావు, పెళ్లి కుమార్తె క్షేమంగా ఉన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజారావు తెలిపారు. -
Andhra Pradesh Police: పోలీస్ సేవలకు ఫిదా
సాక్షి, అమరావతి: సేవకు ప్రతిరూపంలా నిలుస్తున్న ఏపీ పోలీసుల తీరుకు ప్రజలు ఫిదా అవుతున్నారు. తాజాగా.. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం సముద్ర తీరంలో కుళ్లిపోయిన అనాథ శవాన్ని భుజాలపై 3 కి.మీ. మోసుకెళ్లిన ఎస్సై వి.అరుణ్‌కిరణ్, సిబ్బందిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీతపాలెం తీరానికి మృతదేహం కొట్టుకు రాగా.. రాంబిల్లి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. తెలిసిన వాళ్లుంటే మృతదేహాన్ని తీసుకెళ్లాలని చుట్టుపక్కల గ్రామాలకు ఎస్సై అరుణ్‌కిరణ్ సమాచారం అందించారు. మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో మృతదేహం కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఎస్సై అరుణ్‌కిరణ్ ముందుకొచ్చి ఏఎస్సై దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డ్ కొండబాబు సాయంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకుని యలమంచిలి మార్చురీకి తరలించారు. ఇదిలావుంటే.. ఈ నెల 26న కర్ణాటక నుంచి వచ్చిన 40 మంది భక్తులు శ్రీశైలం అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరారు. భీముని కొలను లోయ వద్దకు వచ్చేసరికి తీవ్రమైన ఎండ కారణంగా దాహంతో అలమటించారు. ఈ స్థితిలో డయల్ 100కు కాల్ చేశారు. శ్రీశైలం వన్‌టౌన్ ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో వెళ్లి భక్తుల దాహార్తి తీర్చి, వారిని క్షేమంగా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లి అందరి మన్ననలు అందుకున్నారు. ఇటువంటి సేవలే పోలీస్ ప్రతిష్ట పెంచుతాయి శాంతిభద్రతల నిర్వహణలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు తమదైన రీతిలో అందిస్తున్న ఇటువంటి సేవలు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచుతున్నాయి. విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటామని మరోసారి రుజువు చేసిన రాంబిల్లి, శ్రీశైలం పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
తండ్రి గాఢ నిద్రలో ఉండగా.. పాక్కుంటూ వెళ్లి..
రాంబిల్లి(యలమంచిలి): తెల్లవారు 3 గంటల సమయం.. ముళ్ల పొదల్లోంచి చిన్నారి ఏడుపు శబ్ధాలు గమనించిన స్థానికుడు 100 కు ఫోన్ చేశాడు. రంగంలోకి రాంబిల్లి పోలీసులు దిగా రు. ముళ్లపొదల్లో ఏడుస్తున్న బాలుడిని బయ టకు తీశారు. బాలుడు సురక్షితం. వెంటనే బాలుడికి పాలు, ఆహారం అందించిన ఎస్ఐ వి. అరుణ్‌కిరణ్ విచారణ ప్రారంభించారు. బాలు డు ఎవరని చుట్టుపక్కల ఆరా తీశారు. ఈ బాలుడు తండ్రి సుమారు 30 మీటర్ల దూరంలో గాఢ నిద్రలో పడుకొని వున్నాడు. తండ్రి పేరు దుంగా రాజు. ఇతనిది యలమంచిలి. కొండవారపాలెంలో కొబ్బరికాయలు తీస్తుంటాడు. అయితే గురువారం రాత్రి ఇతని కుమారుడు రెండేళ్ల దుంగా ఉదయ్‌ప్రకాష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని యలమంచిలిలో తన భార్యతో కలిపి జరుపుకొన్నాడు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే తనతో పాటు కొడుకును కొండవారపాలెం తీసుకువచ్చాడు. గాఢ నిద్రలోకి జారుకోవడంతో బాలుడు తుప్పల్లోకి పాకుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత పోలీసుల రావడం , సురక్షితంగా బాలుడు బయటపడడం ఆ తర్వాత తండ్రికి అప్పగించడం జరిగిపోయాయి. -
ఎంతటి వారైనా.. బురద పూసుకోవాల్సిందే..!
రాంబిల్లి (యలమంచిలి): బురదమాంబ జాతర. ఎంతటివారైనా ఆ జాతర రోజున బురద పూయించుకోవాల్సిందే. వయసుతో సంబంధం ఉండదు. మగవారు మాత్రమే పాల్గొంటారు. ఆడవారికి మినహాయింపు ఉంటుంది. ఇటువంటి వింత జాతర రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభం అవుతుంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. జాతర రోజు గ్రామంలో ఉంటే ఎంతటివారైనా బురద పూయించుకోవాల్సిందే. వయసుతో సంబంధం లేకుండా మగవారికి డ్రైనేజీల్లో బురదను పూస్తారు. ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడతారు. ఎంతో ఉత్సాహంగా సాగే వింత పండగ. దల్లమాంబ జాతరలో భాగంగా అనుపు మహోత్సవం సందర్భంగా దిమిలిలో రెండేళ్లకోసారి ఈ జాతర నిర్వహిస్తారు. వేపకొమ్మలను ముంచి.. వేపకొమ్మలను మురుగుకాలువల్లో ముంచి బురదను ఒకరిపై ఒకరు పూసుకొని కేరింతలు కొడుతూ చిన్నారులు, యువకులు నృత్యాలు చేస్తారు. జాతర అనంతరం వేప కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని గ్రామస్తులు కొలుస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహిమగా భక్తులు భావిస్తారు. ఈ జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పురవీధుల్లో దల్లమాంబ అమ్మవారి ఘటాన్ని ఊరేగించి మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు పూర్తి చేయడంతో దల్లమాంబ ఉత్సవాలు ముగుస్తాయి. -
కూలిన కుటుంబాలు
కూలిపనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు దిమిలి గ్రామంలో విషాదం రాంబిల్లి: పొలం పనికి వెళుతున్నాం.. సాయంత్రానికి కూలి డబ్బులతో తిరిగొస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి ఆనందంగా బయలుదేరారు.. వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాద వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఇక తమ వారు తిరిగిరారని తెలిసి వారంతా కుప్పకూలిపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి బతుకుల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన నలుగురు కూలీలు ఆదివారం ఉదయమే కూలి పని కోసం ట్రాక్టర్‌పై బయలుదేరారు. వీరితో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇదే మండలం రాజుకోడూరులో వరి నూర్పిడి పనులకు వీరంతా వెళుతుండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో పంచదార్ల సమీపంలో కోనేరు చెరువు దాటుతుండగా ప్రమాదకరమైన మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బండి రాము(50), శానాపతి సత్యనారాయణ(40) అనే కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సుందరపు వెంకటరమణారావు(45) అనే కూలి మార్గ మధ్యలో మృతి చెందాడు. మరో కూలి బండి అప్పారావుతో పాటు ట్రాక్టర్ డ్త్రెవర్ జి.నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వీరిద్దరినీ పోలీసులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు స్పందించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యలమంచిలి సీఐ వెంకటరావు, రాంబిల్లి ఎస్ఐ కె.కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించారు. డ్త్రెవర్ నాయుడు యలమంచిలికి చెందిన వ్యక్తి కాగా, మిగిలినవారంతా దిమిలి గ్రామానికి చెందిన వారని ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యలమంచిలి మార్చురీ వద్ద ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, దిమిలిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మృతదేహాలను సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. దిమిలిలో విషాదం.. రోజులాగే పనుల కోసం వెళ్లిన ముగ్గురు కూలీలు విగత జీవులుగా తిరిగి రావడంతో దిమిలి గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడు సత్యనారాయణ నిరుపేద. ఆయన మృతితో భార్య, ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. అలాగే మృతుడు సుందరపు వెంకటరమణరావు భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్ద కుమారుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా చిన్నవాడు చదువుకుంటున్నాడు. ఇదివరకే తల్లిని కోల్పోయిన వీరు ఇప్పుడు తండ్రిని కోల్పోవడం గ్రామస్తులను కలిచివేసింది. మరో మృతుడు బండి రాముకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశారు. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే. -
25మంది విద్యార్థినులకు అస్వస్థత
రాంబిల్లి : విశాఖపట్నం రాంబిల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆహారం వికటించి 25 మంది విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. ఈ విద్యాలయంలో మొత్తం 180 మంది విద్యార్థినులు ఉండగా, ఆదివారం రాత్రి వీరికి ఉడికీ ఉడకని ఆహారాన్ని వడ్డించారు. సోమవారం ఉదయం మెనూ ప్రకారం పులిహోర పెట్టాల్సి ఉండగా.. రాగి జావను ఇచ్చారు. ఆ తర్వాత వాంతులు, కడుపు నొప్పితో 25 మంది అస్వస్థతకు గురికాగా వారిలో 16 మందికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మిగిలిన 9 మందిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఆహారానికి, ఉదయం ఇచ్చిన జావకు సరిపడక విద్యార్థినులు అస్వస్థత పాలైనట్టు విద్యాలయం సిబ్బంది తెలిపారు.