కూలిపనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా
ముగ్గురు కూలీలు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
దిమిలి గ్రామంలో విషాదం
రాంబిల్లి: పొలం పనికి వెళుతున్నాం.. సాయంత్రానికి కూలి డబ్బులతో తిరిగొస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి ఆనందంగా బయలుదేరారు.. వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాద వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఇక తమ వారు తిరిగిరారని తెలిసి వారంతా కుప్పకూలిపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి బతుకుల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన నలుగురు కూలీలు ఆదివారం ఉదయమే కూలి పని కోసం ట్రాక్టర్‌పై బయలుదేరారు. వీరితో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇదే మండలం రాజుకోడూరులో వరి నూర్పిడి పనులకు వీరంతా వెళుతుండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో పంచదార్ల సమీపంలో కోనేరు చెరువు దాటుతుండగా ప్రమాదకరమైన మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బండి రాము(50), శానాపతి సత్యనారాయణ(40) అనే కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సుందరపు వెంకటరమణారావు(45) అనే కూలి మార్గ మధ్యలో మృతి చెందాడు. మరో కూలి బండి అప్పారావుతో పాటు ట్రాక్టర్ డ్త్రెవర్ జి.నాయుడు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సహాయంతో వీరిద్దరినీ పోలీసులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు స్పందించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యలమంచిలి సీఐ వెంకటరావు, రాంబిల్లి ఎస్‌ఐ కె.కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించారు. డ్త్రెవర్ నాయుడు యలమంచిలికి చెందిన వ్యక్తి కాగా, మిగిలినవారంతా దిమిలి గ్రామానికి చెందిన వారని ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యలమంచిలి మార్చురీ వద్ద ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, దిమిలిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మృతదేహాలను సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
దిమిలిలో విషాదం..
రోజులాగే పనుల కోసం వెళ్లిన ముగ్గురు కూలీలు విగత జీవులుగా తిరిగి రావడంతో దిమిలి గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడు సత్యనారాయణ నిరుపేద. ఆయన మృతితో భార్య, ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. అలాగే మృతుడు సుందరపు వెంకటరమణరావు భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్ద కుమారుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా చిన్నవాడు చదువుకుంటున్నాడు. ఇదివరకే తల్లిని కోల్పోయిన వీరు ఇప్పుడు తండ్రిని కోల్పోవడం గ్రామస్తులను కలిచివేసింది. మరో మృతుడు బండి రాముకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశారు. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే.
కూలిన కుటుంబాలు
Published Sun, Feb 7 2016 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement