డీజీపీ సవాంగ్‌కు స్వాగతం పలుకుతున్న ఏపీఎస్‌పీ ఐజీపీ శంకబ్రత బాగ్చీ
సాక్షి, అమరావతి: సమర్థవంతమైన సేవలందిస్తున్న ఏపీ పోలీస్ అనేక విషయాల్లో దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి మంగళవారం అవార్డులను అందజేశారు. ‘ఏపీఎస్‌పీ కమాండేషన్ డీజీపీ డిస్క్ అవార్డు’ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అవార్డులను తొలిసారిగా 38 మందికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో ఏపీ పోలీస్ శాఖ సిబ్బంది, వనరుల కొరత వంటి అనేక సమస్యలను ఎదుర్కొందన్నారు. వీటన్నింటినీ అధిగమించిన ఏపీ పోలీస్ శాఖ ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశంలో పోలీస్ శాఖలో చేపట్టిన అనేక సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాలకు అండగా పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
వెన్నెముకగా ఏపీఎస్‌పీ
స్వాతం్రత్యానికి పూర్వం నుంచీ ఉన్న బెటాలియన్స్ ఫోర్స్ అనేక పోలీస్ విభాగాలకు వెన్నెముకగా ఉండటం గర్వకారణమని సవాంగ్ కొనియాడారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్ వంటి కీలక విభాగాల్లో 80 శాతం మంది ఏపీఎస్‌పీ సిబ్బంది డెప్యూటేషన్‌పై పనిచేయడం గొప్ప విషయమన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వీరు సేవలు అందించిన ఘన చరిత్ర ఉందన్నారు. ఏపీఎస్‌పీ నుంచే ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్) ఏర్పాటైందని.. ఏపీఎస్‌పీ దేశానికే ప్రామాణికంగా పనిచేస్తోందన్నారు.
పక్కన డీజీపీకి గౌరవ వందనం చేస్తున్న ఏపీఎస్‌పీ బెటాలియన్ సిబ్బంది
సవాంగ్ నేతృత్వంలోనే సంస్కరణలు
ఏపీఎస్‌పీ బెటాలియన్స్ ఐజీ శంకబ్రత బాగ్చీ మాట్లాడుతూ.. 2012 నుంచి 2015 వరకు ఏపీఎస్‌పీ బెటాలియన్స్ బాధ్యతలు నిర్వర్తించిన డీజీపీ సవాంగ్ అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన సవాంగ్.. సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, హోంగార్డ్స్ ఏడీజీ హరీష్‌కుమార్‌గుప్తా, బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ పాల్గొన్నారు. కాగా, ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావుకు డీజీపీ పోలీస్ మెడల్‌ను డీజీపీ అందజేశారు.
మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై ఉక్కుపాదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సవాంగ్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వీటి బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆన్‌లైన్ యాప్‌లతో రుణం ఇస్తానన్న వారి మాటలు నమ్మొద్దని.. యాప్‌ల ద్వారా అప్పులు చేసి చిక్కుల్లో పడొద్దని హితవు పలికారు. లోన్ల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
జనవరి 4 నుంచి పోలీస్ డ్యూటీ మీట్
తిరుపతిలో జనవరి 4నుంచి 7వరకు నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాట్లను వెబినార్ ద్వారా డీజీపీ సమీక్షించారు. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ మీట్‌ను నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment