
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కరోనా బారినపడుతున్నా ధైర్యంగా ప్రజారోగ్యం కోసం పాటు పడుతున్నారని పోలీసులను ఆయన అభినందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న సిబ్బంది పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. లాక్ డౌన్ తర్వాత నలభై రోజుల్లో 800 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారిన పడ్డారని ఆయన వెల్లడించారు.
‘‘లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే విపరీతంగా వ్యాప్తి పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పందనలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చెక్‌పోస్టు వద్ద అనుమతి పత్రాలు చెక్ చేసిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తాం. నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 ద్వారా బాల కార్మికులు, వీధి బాలలపై కూడా దృష్టిపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలను సమన్వయ పరుచుకుంటూ సీఐడీ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తుంది. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ సాగుతుంది. వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తాం. అవసరమైతే ఆసుపత్రులకు తరలిస్తాం’’ అని డీజీపీ పేర్కొన్నారు.
తల్లిదండ్రులు లేని పిల్లలను సంరక్షణా కేంద్రాలకు పంపుతామని, ప్రభుత్వ చొరవతో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గతేడాది 2500 మంది పిల్లలని రెస్క్యూ చేశామని ఆయన వివరించారు. పిల్లలు, మహిళల సంరక్షణతో పాటు విశాఖ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించామని, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు.