
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ ముందుండి పని చేస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించటాన్ని పోలీసు శాఖ సవాల్‌గా తీసుకుని పని చేస్తోందని చెప్పారు. గురువారం రాత్రి ‘సాక్షి’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
► రెడ్ జోన్లలో పోలీస్ సిబ్బంది 11 ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో అద్భుతంగా పని చేస్తున్నారు. పోలీసుల సేవలను ప్రజలు గుర్తించి అభినందిస్తుండటం మా బాధ్యతను మరింత పెంచుతోంది.
► వూహాన్ నుంచి వైద్య విద్యార్థులు, ఇటలీ నుంచి మరో విద్యార్థి రావడంతో తొలిసారిగా రాష్ట్రంలో కరోనాను గుర్తించాం. వెంటనే అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చిన 22,266 మంది జాబితాను సేకరించి క్వారంటైన్‌లో ఉంచాం.
► గుంటూరులో ఓ పాజిటివ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తే ఢిల్లీ లింక్ బయటపడింది. గుంటూరు, కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లడంతో ఆ రెండు జిల్లాల్లో కేసులు పెరిగాయి.
► హోం క్వారంటైన్ యాప్‌ను వినియోగించి మంచి ఫలితాలు సాధించాం. డ్రోన్లను కూడా వాడుతున్నాం. టెక్నాలజీ ద్వారా Üవాళ్లను అధిగమిస్తున్నాం.
► రాష్ట్రంలో 181 రెడ్‌జోన్లలో రాకపోకలు లేకుండా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నాం.
► రాష్ట్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి.
► సోషల్ మీడియా ద్వారా పుకార్లు, వదంతులు వ్యాప్తి చేయకుండా పోస్టింగ్‌లు, కామెంట్ల్లపై నిఘా పెట్టాం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారిపై 139 కేసులు నమోదు చేశాం.
► 289 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చాం.
► క్వారంటైన్ సెంటర్లలో వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందిపై ఎవరైనా వేధింపులు, దాడులకు పాల్పడితే బెయిల్ కూడా రాదు. ఏడేళ్ల జైలు విధించేలా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది.
► లాక్‌డౌన్‌ను సదవకాశంగా భావించి కుటుంబంతో అందరూ ఆనందంగా గడపాలి. ఇంటి పనుల్లో సాయం చేయడంతోపాటు ఈ సమయాన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలి. నా ఫిట్‌నెస్‌కు కారణం క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, భగవంతుడి దయ.