
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో గ్యాంగ్‌వార్ పేరిట పలు టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోల్లోని ఘటనలు గత ఏడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగినవిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కథనాలపై స్పందించిన డీజీపీ గౌతమ్‌సవాంగ్ తక్షణ విచారణ జరపాలని గుంటూరు రేంజ్ డీఐజీ, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చారని పేర్కొంది.
ఆ ఘటనలు కేవలం మిత్రుల మధ్య జరిగిన ఘర్షణలని, అయినప్పటికీ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారని వివరించింది. నిందితులపై రౌడీషీట్ కూడా తెరవనున్నట్టు తెలిపింది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ పేర్కొంది.