పథకం ప్రకారం ఆలయాల్లో వారే ఘటనలకు పాల్పడ్డారు. ఆ విషయం గురించి తొలుత వారికే తెలుసు కాబట్టి వారే మీడియాకు లీకులిచ్చారు. తప్పుడు ప్రచారం చేయించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా దుష్ప్రచారానికి పాల్పడ్డారు. తద్వారా రాజకీయం చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టి, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.
– డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: ఆలయాల ఘటనల్లో రాజకీయ పార్టీల కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టీడీపీ, బీజేపీకి చెందిన వారు ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని డీజీపీ డి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసు దర్యాప్తులో ఛేదించిన వాటిలో తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీలకు చెందిన 21 మందికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్టు తేలిందన్నారు. వారిలో ఇప్పటికి 15 మందిని అరెస్టు చేశామన్నారు. ఇప్పటి వరకు తమ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. డీజీపీ ఇంకా ఏం చెప్పారంటే..
ఓ పథకం ప్రకారం ఘటనలు
► రాష్ట్రంలోని దేవాలయాల్లో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయాల్లో ఏమీ జరగకుండానే జరిగినట్టు దుష్ప్రచారం చేయడం, ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలను సైతం ఇప్పుడే జరిగినట్టు తప్పుడు ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ ఘటనల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం.
► ప్రతి సంఘటన తర్వాత రాజకీయ పార్టీల దుష్ప్రచారం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అది కూడా ఒక పథకం ప్రకారం మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే దురుద్దేశం, కుట్ర కన్పిస్తోంది. రాజకీయ పార్టీలకు చెందిన వారే ప్రత్యక్షంగా కొన్ని ఘటనల్లో పాల్గొనగా, మిగిలిన ఘటనల్లో పథకం ప్రకారం ఆ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం.
దేవాలయాల రక్షణకు పటిష్ట చర్యలు
► ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలకు రక్షణ లేదన్న ప్రచారం శుద్ధ అబద్ధం. ఇదంతా కొన్ని రాజకీయ పక్షాలు పనికట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. వాస్తవానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాం.
► గతంతో పోల్చితే 2020లో దేవాలయ సంబంధిత ఘటనలు తక్కువే. రాష్ట్రంలో దేవాలయ రక్షణ కమిటీలు, మత సామరస్యపు కమిటీలను ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నాం.
► గతేడాది సెప్టెంబర్‌లో దేవాలయాలకు సంబందించి 44 ఘటనల్లో 29 కేసులు చేధించి 81 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఇదివరకే ప్రకటించాం. ఆలయాల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నాం.
► ఇప్పటి వరకు 13,296 దేవాలయాల్లో 44,521 సీసీ కెమెరాలు అమర్చారు. ఆయా ఘటనల్లో 4,643 మంది నేరగాళ్లు, కమ్యూనల్ సస్పెక్ట్‌లను బైండోవర్ చేశాం. 180 దేవాలయ కేసులను ఛేదించాం. 337 మందిని అరెస్టు చేశాం. రాష్ట్రంలో 18,050 గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశాం. దేవాలయాల ఘటనలపై ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. ఏదైనా సమాచారం ఉంటే 9392903400 నెంబర్‌కు తెలియజేయాలి.
మత విద్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించం
► రాజకీయ పక్షాలు కావాలని మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయి. ఇటువంటి చర్యలను ఉపేక్షించం. మీడియా, సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పుకార్లను వ్యాపింప చేయడం సరికాదు. ఎవరైనా మత కల్లోలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోడానికి ఏమాత్రం వెనుకాడం.
► మీడియా సమావేశంలో శాంతిభద్రతల అడిషినల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, డీఐజీలు రాజశేఖర్‌బాబు, పాలరాజు, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ పాల్గొన్నారు.
తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీ శ్రేణుల ప్రమేయం
టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, చినరాజప్పతో బాబుఖాన్ చౌదరి
► తొమ్మిది కేసుల్లో 21 మంది ప్రమేయం ఉండగా వారిలో 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ వాళ్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ వాళ్లు అరెస్టు అయ్యారు. మరో నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ వాళ్లు అరెస్టు కావాల్సి ఉంది.
► రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి తానే మలినం పూసి, తానే తప్పుడు ప్రచారం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెల్లంపల్లి ప్రసాద్‌బాబు (బాబుఖాన్ చౌదరి)ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత పీఏ చిటికెన సందీప్ (టీడీపీ), అడపా సందీప్ (బీజేపీ), కరుటూరి శ్రీనివాసరావు(బీజేపీ)లు కూడా ఉన్నారు.
► గుంటూరు రూరల్ నరసరావుపేట శంకర్‌మఠంలో సరస్వతి విగ్రహం ధ్వంసం అయినట్టు తప్పుడు ప్రచారం చేసిన కేసులో టీడీపీకి చెందిన చల్లా మధుసూధన్‌రెడ్డి అరెస్టు అయ్యాడు.
► వైఎస్సార్ కడప జిల్లా కొండలవీడు గ్రామంలో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన భూమిలో కావాలని అవాంతరాలు సృష్టించేందుకు అక్కడ ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి చెప్పుల దండ వేశారు. ఈ కేసులో టీడీపీ సానుభూతిపరుడైన బొజ్జన సుబ్బారెడ్డి(టీడీపీ)ని అరెస్టు చేశారు.
► కర్నూలు జిల్లా మద్దమ్మ గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీకి చెందిన గొల్ల పెద్దయ్య, గెద్దా రామాంజనేయులు, బ్రమే జయరాముడు, సయ్యద్ ఫక్రుద్దీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
► కర్నూలు జిల్లా మర్లమంద గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ ఆర్చిలో సీతారాముల విగ్రహాల కాళ్లను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో టీడీపీకి చెందిన ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
► ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఆర్చిలో లక్ష్మీనరసింహాస్వామి, చెంచులక్ష్మి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం ఘటనలో తప్పుడు ప్రచారం చేయడంపై టీడీపీకి చెందిన మద్దసాని మౌళాలి, గాలి హరిబాబు, కాకర్ల నరసింహారావులను అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన మరో ముగ్గురు మించాల బ్రహ్మయ్య, వెల్పుల వెంకట్రావు, సిరిమల్లి సురేష్‌లు పరారీలో ఉన్నారు.
► విశాఖపట్నం రూరల్ జిల్లా ఏటిగైరంపేట గ్రామానికి చెందిన రామాలయంలో వినాయక విగ్రహం పగిలిపోయింది. ఈ కేసులో దుష్ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన టీడీపీకి చెందిన కిలాడ నరేష్, పైల çసత్తిబాబులను పోలీసులు అరెస్టు చేశారు.
► శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో భూలోకమాత గుడిలో హనుమాన్ విగ్రహం ధ్వంసమైనట్టు తప్పుడు ఫొటోను మీడియాలో వైరల్ చేసిన కొంచాడ రవికుమార్(బీజేపీ)ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ విగ్రహం రెండేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను సమయంలో దెబ్బతింది. దాన్ని ఎవరో దుండగులు ఇప్పుడు ధ్వంసం చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు.
► శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో దెబ్బతింటే ఇప్పుడు ఎవరో దుండగులు ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియాలో ఫొటో వైరల్ చేసి మతపరమైన అలజడి రేపేందుకు ప్రయత్నించిన ధర్మవరపు ఆచార్య(బీజేపీ)ను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment