తిరుమల పవిత్రతను మంటగలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం
బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల పూజలు
పవిత్ర లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారు
తిరుమలలో రాజకీయ చిచ్చురేపి చలి కాచుకుంటున్నారు.. టీటీడీ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కల్పిస్తూ భక్తులను రెచ్చగొడుతున్నారు
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రులు,టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తందానా
బాబు మహాపచారం ప్రభావం రాష్ట్రంపై పడకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ శ్రేణుల వేడుకోలు
అనంతపురం మొదలు ఇచ్ఛాపురం వరకు హోమాలు, అభిషేకాలతో హోరెత్తిన ఆలయాలు
పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న ప్రజలు
‘‘స్వామీ.. చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము మా ఊళ్లోని మీ గుడిలో పూజలు చేస్తున్నాం.. తప్పు చేసింది మేం కాదు.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడు.. ఆయన నిర్వాకంపై మీకొస్తున్న కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపైనే చూపండని వేడుకుంటున్నాం.. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం.. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ..
జరగనిది జరిగినట్లుగా.. వాడని జంతువుల కొవ్వును వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్ధాలాడుతూ మిమ్మల్ని(దేవుడు) అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తూ అపవిత్రం చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై దెబ్బ కొట్టారు.. దేవుడు, దైవం.. అనే భయం, భక్తి లేకుండా.. కళ్లార్పకుండా చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు..
వైఎస్ జగన్‌పై కోపంతో మమ్మల్ని క్షోభకు గురిచేస్తూ.. మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నారు. ఆ పాపాన్ని కడిగేయాలని అభిషేకాలు, పూజలు చేస్తున్నాం.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాం.’’
– రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజల వేడుకోలు
సాక్షి నెట్‌వర్క్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అపచారం ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకుండా చూడాలని వేడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆలయాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు.. హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోని ఆలయాలు ప్రత్యేక పూజలతో కిటకిటలాడాయి. అనంతపురం మొదలు ఇచ్ఛాపురం వరకు హోమాలు, అభిషేకాలతో ఆలయాలు హోరెత్తాయి.
పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలతో దేవదేవుడికి కలిగే ఆగ్రహం చంద్రబాబు వరకే పరిమితమయ్యేలా చూడాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు స్వామి వారిని వేడుకున్నారు. వైఎస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు, అభిమానులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
బాబు పాపాలకు ప్రక్షాళన గావించాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, తెలుగు ప్రజలందరూ హారతులిచ్చారు. మత రాజకీయాలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని, తిరుమల పవిత్రతను ‘మంట’గలుపుతూ చలి కాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కల్పిస్తూ భక్తులను రెచ్చగొడుతున్నారని, బాబు వ్యాఖ్యలకు మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తందానా అంటుండటం బాధాకరమని అన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని అసలు ఉపయోగించనప్పుడు తప్పు జరగడానికి ఆస్కారమే లేదని, అయినా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. బాబు మహాపచారం ప్రభావం రాష్ట్రంపై పడకుండా చూడాలని పదే పదే వేడుకున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మద్దతుగా ప్రజలు తరలివచ్చి పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా డోన్‌లోని వేంకటేశ్వరాలయంలో పూజలు చేసేందుకు పాదయాత్రగా వెళ్తున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
దేవదేవుడి నుంచి బాబు తప్పించుకోలేరు
యూకేలో తెలుగు ప్రజల ప్రత్యేక పూజలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తిరుమల పవిత్రతను కాపాడాలని శనివారం లండన్ ఈస్ట్ హ్యంలో ఉన్న మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగువారు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ.. పార్టీ అభిమానులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లడ్డూ పవిత్రత విషయంలో తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఆ దేవ దేవుడి శాపం నుంచి తప్పించుకోలేడని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి, వెంకట రమణ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment