సాక్షి, అమరావతి: హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా దృక్పథంతో హోం గార్డులు నిర్వహించిన విధులు, వారు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. హోంగార్డుల సంక్షేమం, వారి పిల్లల విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోజువారీ భత్యం రూ.710కి పెంచామన్నారు.
15 వేల హోం గార్డు కుటుంబాలను యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేశామన్నారు. ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.30 లక్షలకు ఇన్సూరెన్స్ చేశామని, భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచుతామని చెప్పారు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది రూ.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. మహిళా హోం గార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నామన్నారు. హోం గార్డుల ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. హోంగార్డులు అంకితభావంతో, మంచి సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని డీజీపీ ఆకాంక్షించారు.
హోంగార్డుల కుటుంబాల్లో జగన్ వెలుగులు నింపారు
హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.గోవిందు
వేతనాలు పెంచి హోంగార్డుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారని హోం గార్డ్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవిందు పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతో పాటు సంఘం నాయకులు డి.బాబురావు, బి.చిరంజీవి, కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాసులు హోం మంత్రి సుచరితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హోం గార్డుల సమస్యలపై వినతి పత్రాన్ని హోం మంత్రికి అందజేశారు. హోంగార్డులకు రోజుకి రూ.600 నుండి రూ.710కి వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment