సాక్షి, విజయవాడ: అన్ని వర్గాలను రక్షించేందుకు ఏపీ పోలీసు శాఖ పని చేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. కేసుల విచారణలో బాధితుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఆమె సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలామ్ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. ఇద్దరు అధికారులతో విచారణ కమిటీని నియమించామని ఆమె తెలిపారు. హోంమంత్రి సుచరిత సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అబ్దుల్ సలాం ఆత్మహత్యకు సీఐ, హెడ్ కానిస్టేబుల్ వేధింపులు కారణం అని తేలింది. కుటుంబ పెద్దను ఆదుకోవడానికి 25లక్షల ఆర్ధిక సహాయం అందించాం. కొద్దిరోజులుగా వివిధ జిల్లాల్లో నమోదు అయిన పోలీసుల అత్యుత్సాహం తక్షణమే స్పందించాం. చదవండి: సోమశిల రెండో దశకు సీఎం జగన్ శంకుస్థాపన
అన్ని వర్గాలను రక్షించేందుకు ఏపీ పోలీసు శాఖ పని చేస్తోంది. ఇటువంటి ఘటనల్లో బాధ్యులను ఉపేక్షించేది లేదు. నిస్పక్షపాతంగా కేసులు విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో జరిగిన అన్ని ఘటనల్లో ఒకదానికి ఒకటి సంబంధం లేనిదే. బాధితులను కులాల వారీగా ప్రభుత్వం విభజించడం లేదు. బాధితుల్ని గుర్తించి అందరికి న్యాయం చేస్తున్నాం. గతంలో నమోదు అయిన ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి. బాధితుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తే జిల్లా పోలీసు కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చెయ్యండి. బలవంతంగా ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు. అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులను ప్రభుత్వం ఎప్పటికీ కాపాడదు. రాజధాని రైతుల కేసులు, అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు ఒకటి కాదు’ అని తెలిపారు. చదవండి: సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు
ప్రజలకు సేవ చేసేందుకే పోలీసులు
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... ‘అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బాధ్యులను అదుపులోకి తీసుకున్నాం. రాష్ట్రంలో పోలీసులు కొన్ని ఘటనల్లో బాధ్యులుగా ఉన్నారు. బాధ్యులైన ఇద్దరు పోలీసులపై క్రిమినల్ కేసులు ఇప్పటికే నమోదు అయ్యాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారి పట్ల వ్యవహరించాల్సిన తీరుపై పోలీసులకు అవగాహన కల్పిస్తాం. పోలీస్ శాఖలో బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలో, ఎలాంటి మార్పులు చేయాలో చర్చిస్తున్నాం. ఇప్పటికే ఇటువంటి కేసుల్లో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. పోలీసులు ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే కేసులను ఛేదిస్తున్నాం. పోలీసు శాఖపరంగా అన్నిరకాల చర్యలు చేపడుతున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment