
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సక్రమంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను గుర్తించి శిక్షించాలనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పూర్వ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. దోషులు ఎంతవారైనా సరే కచ్చితంగా ఉపేక్షించొద్దనే చెప్పారని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి తనను ఉద్దేశించి కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాలు పూర్తిగా అవాస్తవమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డిలను తన వద్దకు సీఎం పంపారని పత్రికల్లో ప్రచురితమైన సమాచారం పూర్తిగా అవాస్తవమన్నారు.
తాను డీజీపీగా ఉండగా ఆ ముగ్గురూ ఎప్పుడూ కలవలేదని తెలిపారు. ఆ ముగ్గురూ తనకు రెండు కళ్లు లాంటివారని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్లుగా తాను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి వద్ద వ్యాఖ్యానించినట్లు కొన్ని పత్రికలు అవాస్తవాలను ప్రచురించాయన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు అని మాత్రమే ముఖ్యమంత్రి తనతో చెప్పారని, అదే విషయాన్ని 2019 సెప్టెంబర్‌లో తనను కలిసిన సునీత, రాజశేఖరరెడ్డి దంపతులకు చెప్పినట్టు పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించి దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని వారికి వివరించినట్లు చెప్పారు. అదే సమయంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన తనతో చెప్పారని కూడా వారికి తెలియజేశానన్నారు. తదనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు, వాస్తవాలను కోర్టు ముందుంచాలని సీఎం జగన్ తమకు స్పష్టంగా నిర్దేశించారన్నారు. సక్రమంగా దర్యాప్తు చేయడమే కాకుండా అదే విశ్వాసాన్ని అందరిలోనూ కల్పించాలని సీఎం నిర్దేశించారన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఏ దశలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.