
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అలజడులు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. అనుమతి కలిగిన ఆయుధాలను ఎన్నికలు అయ్యే వరకు స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యం, డబ్బు రవాణాను అడ్డుకుని పంపిణీకి అవకాశం లేకుండా చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు జరిగేలా ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల మ్యాపింగ్ చేసి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్పెషల్ బ్రాంచ్‌ని రంగంలోకి దించి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
గత ఎన్నికల్లో విధ్వంసాలు, అలజడులకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. పోలింగ్ అనంతరం కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. గ్రామాలను పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు సందర్శిస్తాయి. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ , పాత కక్షలు ఉండే గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే చర్యలు, పార్టీలను, వ్యక్తులను కించపరిచే పోస్టింగ్‌లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టారు.
1,47,391 మంది బైండోవర్..
ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. వాటిలో తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు 6,254, సమస్యాత్మక ప్రాంతాలు 8,555, వామపక్ష తీవ్రవాద ప్రభావం, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్న ప్రాంతాలు 983 ఉన్నట్టు నిర్ధారించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 44 ఘటనలపై కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలకు సంబంధించి 12,779 కేసుల్లో నిందితులుగా ఉన్న 1,47,391 మందిని బైండోవర్ చేశారు. నేరాల్లో నిందితులుగా ఉండి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న 4,865 మందిలో 2,246 మందిని పోలీసులు పట్టుకోగలిగారు.
లైసెన్స్ కలిగిన ఆయుధాలు 9,942 ఉండగా వాటిలో ఇప్పటి వరకు 9,199 స్వాధీనం చేసుకున్నారు. అనుమతిలేని పేలుడు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయ ఆయుధాలు 17, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ 1,058, ఎలక్ట్రిక్ వైర్స్ మూడు క్వాయిల్స్, బ్యాటరీలు 2, సేఫ్టీ ఫ్యూజ్‌లు, డిటోనేటర్ ఫ్యూజ్‌లు 37, ఎయిర్ ఫిస్టల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 5,02,49,007 నగదు, రూ. 13,03,73,319 విలువైన బంగారం, వెండి, మద్యం, నాటుసారా, గంజాయి, చీరలు, వాహనాలను తనిఖీల సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 707 కేసులు నమోదు చేశారు.
అందరూ సహకరించాలి: డీజీపీ
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. శాంతిభద్రతల అడిషినల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్‌తో కలిసి మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు. నామినేషన్లు, పోలింగ్, పోలింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఏ చిన్న ఘటన జరిగినా పోలీసులు తక్షణం స్పందిస్తున్నారని డీజీపీ వివరించారు. బందోబస్తుకు బయటి ప్రాంతాల నుంచి ఎటువంటి బలగాలు రావడంలేదని స్పష్టం చేశారు.
పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఎన్నికల బందోబస్తు విధులు కేటాయించడంలేదని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి రక్షణ పరికరాలు అందిస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి గృహ నిర్భందం విధించాలంటూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన డీజీపీ.. ఆ ఆదేశాల లేఖ ఇంకా తనకు అందలేదని, దానిని పరిశీలించాకే స్పందిస్తానని తెలిపారు. ఏ ఘటనపైన అయినా ఆధారాలు ఉంటే పోలీసుల దృష్టికి తేవాలని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.