సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అంశంపై పూర్తి అవగాహన కల్పించడం ద్వారా తాము సురక్షితమైన భద్రత వ్యవస్థలో ఉన్నామని మహిళలకు భరోసా కల్పించేందుకు ఉపక్రమించింది. అందుకోసం ‘దిశ’ మొబైల్ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కార్యాచరణను విస్తృతం చేసింది. విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణం పోలీసు సహాయం పొందేందుకుగాను విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. దిశ యాప్‌పై ప్రజల్లో స్వయంగా అవగాహన కల్పించాలని ఆయన నిర్ణయించారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కూడా ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.
యాప్‌ను డౌన్‌లోడ్ చేయించనున్న సీఎం
గొల్లపూడిలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ‘దిశ’ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. గొల్లపూడిలోని ఒకటో నంబర్ రోడ్డులో ఉన్న పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకోసం పెద్ద తెర, ప్రొజెక్టర్ మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని, ఆపదలో ఉపయోగించాల్సిన విధానాన్ని విద్యార్థినులు, యువతులు, మహిళలకు ముఖ్యమంత్రి వివరిస్తారు. కొందరు మహిళల మొబైల్ ఫోన్లలో ఆయనే స్వయంగా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తారు.
దశ ‘దిశ’లా మహిళా భద్రత
మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారు. దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్ జస్టిస్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఇక ఆపదలో చిక్కుకుంటే తక్షణం పోలీసు సహాయం పొందేందుకు దిశ యాప్‌ను రూపొందించింది. ఇవన్నీ వివరించడం ద్వారా మహిళలు తాము రాష్ట్రంలో సురక్షితమైన వ్యవస్థలో ఉన్నామనే భరోసాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 లక్షలమందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. గొల్లపూడిలో నిర్వహించే అవగాహన సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద స్క్రీన్ మీద యాప్ పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వివరిస్తారని సీఎం కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం ‘సాక్షి’కి తెలిపారు.
దేశానికే దిశా నిర్దేశం
మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాగత సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దిశ చట్టం తేవడంతోపాటు ఆ చట్టం సమర్థ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన మౌలిక వ్యవస్థను ఏర్పాటుచేసి ఓ రక్షా కవచాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా దిశా యాప్ అవగాహన సదస్సులో పాల్గొననుండటం పోలీసు వ్యవస్థకు, ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.
– గౌతం సవాంగ్, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment