Bike Parade To Cheer Up German Kid Suffering From Cancer Again, Video Goes Viral | Sakshi
Sakshi News home page

లోకం చెడ్డదేం కాదు బాస్‌.. హార్ట్‌ టచింగ్‌ వీడియో

Published Wed, May 1 2024 11:18 AM | Last Updated on Wed, May 1 2024 6:02 PM

Bike Parade To Cheer Up German Kid Suffering From Cancer Again Viral

ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే... అయ్యో అనడం మనిషి సహజ లక్షణం. సహానుభూతి అంటారు ఈ ఫీలింగ్‌ను. ఇంకొంతమంది ఆయ్యో అనడంతో ఆగిపోరు. తమకు చేతనైన సాయం చివరకు మాటసాయమైనా చేసే ప్రయత్నం చేస్తారు. ‘‘నేను ఉన్నాను’’.. ‘‘నువ్వు ఒంటరి కాదు’’ అన్న భరోసా... నిలువెత్తు డబ్బు, బంగారం పోసి కూడా కొనలేము. 

ఇదంతా ఇప్పుడెందుకు అంటే... ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్‌) కనిపించిన ఈ ట్వీట్‌ను చూడండి. మనసులను కదిలించే చిన్ని గాథ! జర్మనీలోని ఆరేళ్ల బాలుడి కథ ఇది! మోటర్‌సైకిళ్లంటే మహా పిచ్చి! పెద్దయ్యాక రేసుల్లో పాల్గొనే వాడేనేమో కానీ... కేన్సర్‌ మహహ్మారి అంత ఎదిగేందుకు అవకాశం ఇచ్చేలా లేదు. అందుకే... ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టారు! 

‘‘మా వాడికి బైక్‌లంటే బాగా ఇష్టం. వీలున్న వారు ఎవరైనా మోటర్‌సైకిల్‌పై మా ఇంటి ముందు నుంచి ప్రయాణించగలరా?. మా వాడి కళ్లల్లో ఆనందం ఇంకోసారి చూసుకోగలం’’ అని అభ్యర్థించారు. అందరివీ బిజి బిజీ బతుకులు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ... 20, 30 మంది వరకూ వస్తారనునన వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. 

ఓ సముద్ర కెరటంలా ‘మనీషి’ కదిలాడు. వేయి.. రెండు వేలు కూడా కాదు.. ఎకాఎకిన ఇరవై వేల మంది మోటర్‌ సైకిళ్లపై ఆ కుర్రాడి ఇంటి ముందు నుంచి వెళ్లారు. వాళ్లలో పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు.  ఆ కుర్రాడి ముఖం చంద్రబింబంలా మెరిసి పోయి ఉంటుందా? కచ్చితంగా మెరిసిపోయే ఉంటుంది. వీడియో మూడు నాలుగేళ్ల కిందటిదే అయినా.. ఆ చిన్నారి తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. మానవత్వం ఈ భూమ్మీద మిగిలే ఉందని, లోకం మనం అనుకునేంత చెడ్డదేం కాదని నిరూపించింది ఈ ఘటన.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement