షర్మిలపై మండిపడుతున్న నెటిజన్లు
సాక్షి, అమరావతి: ఆనాడు పిల్లనిచ్చి.. పదవులిచ్చి.. పార్టీ నీడనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. నేడు ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల సొంత అన్న జగన్‌కే ద్రోహం తలపెట్టారు. స్వార్జిత ఆస్తుల్లో వాటా ఇస్తానన్న అన్న ప్రేమకు విలువ లేకుండా చేస్తూ, ఆయన బెయిల్ రద్దుకు శత్రువులతో కలిసి కుట్రలు చేస్తున్నారు.
పెళ్లయిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన పదేళ్ల అనంతరం కూడా చెల్లికి ఆస్తులిచ్చేంత సహృదయం ఉన్న జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు.
ఈ కుతంత్రాలను రక్తి కట్టించడం కోసం మీడియా ముందు దొంగ ఏడుపులతో డ్రామాలాడుతున్నారు. ఇదేనా వైఎస్సార్ బిడ్డ నైజం. ఇలాగేనా ఆ మహానేత కుమార్తె నడుచుకోవాల్సిన విధానం... అంటూ షర్మిలపై సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ పోస్టులతో దుమ్మెత్తి పోస్తున్నారు. వాటి సారాంశం ఇలా ఉంది..
భారతి పేరు ఉంది.. మీ పేరు లేదంటే ఏంటి అర్థం?
‘వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే... నిజంగా వాళ్లవి అవుతాయా? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్లలేదు అంటున్నారు. అలా అయితే భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా’ అని అంటున్న షర్మిలకు భారతి పేరు ఈడీ కేసుల్లో ఉందనే విషయం తెలియదా? మరి షర్మిల పేరు ఎందుకు లేదు.
అంటే ఆ ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదనే కదా అర్థం. ఎవరైనా తమ ఆస్తులకు వేరే వాళ్ల పేర్లు పెట్టుకుంటుంటే పోనీలే పేరు పెట్టుకుంటే ఏముందిలే అని ఊరుకుంటారా.? అవి జగన్ ఆస్తులు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టుకున్నా దివంగత వైఎస్సార్ అభ్యంతరం చెప్పలేదనేది నిజం కాదా?
చిన్నాన్నను అంత మాట మీరనొచ్చా?
సొంత చిన్నాన్న అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయని, నా బిడ్డలు నీ ముందు పెరగలేదా... అని సుబ్బారెడ్డిని ప్రశ్నించిన షర్మిల అదే చిన్నాన్నను జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, పదవులు ఇస్తే అనుభవిస్తున్నారని అనడం సమంజసమా.
ఆయనపై అంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అంత పెద్ద మాట ఎలా అనగలిగారు షర్మిలమ్మా.? చిన్నాన్న కాబట్టే, మొదటి నుంచీ జరుగుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్నారు కాబట్టే సుబ్బారెడ్డి వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేక ఆయనను నిందించడమేనా మీ సంస్కారం. పైగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను పరీక్షించడం కోసం, వాళ్ల గురించి విజయమ్మకు తెలియడం కోసం లేఖలో వారి పేర్లు ప్రస్తావించారా? ఇప్పుడు మీరు వారిద్దరి గురించి విజయమ్మకు కొత్తగా చెప్పాలా..?
విజయమ్మ క్షోభకు కారణం మీరే కదా?
‘సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడని, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాను.. పురిటిలోనే చంపేయాల్సింది అని ఆ తల్లి అనడం లేదని, ఇది చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను’ అని విజయమ్మ ఏడుస్తోందని చెప్పుకొస్తున్నారు షర్మిల. విజయమ్మ ఈ మాటలు అన్నారో లేదో షర్మిలకే తెలియాలి. అయితే నిజానికి విజయమ్మను ఇంతటి క్షోభకు గురిచేస్తున్నది మాత్రం షర్మిలేనని స్పష్టంగా అర్థం అవుతోంది.
ఆస్తుల కోసం షర్మిల పట్టుబట్టి తల్లిని, కొడుకుని వేరు చేయాలని ప్రయత్నిస్తుండటం విజయమ్మకు కడుపుకోత కాదా? కుమారుడి ప్రతి కష్టంలోనూ, ప్రతి విజయంలోనూ తోడున్న విజయమ్మను కూడా మీ కుట్రలకు వాడుకుంటారా..? బహుశా ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందా అని విజయమ్మ బాధపడుతూ ఉండి ఉంటారు. ఒకసారి చేస్తే సరేగాని ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చేయడం షర్మిలకే చెల్లింది.
చంద్రబాబును కాపాడాలనుకున్న ప్రతిసారీ ప్రెస్‌మీట్ పెట్టడం... కన్నీళ్లు పెట్టేసుకోవడం ఆమెకు బాగా అలవాటైపోయింది. ప్రజలపై రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం వేస్తే రాని కన్నీరు, వాస్తవాలను ఒప్పుకోలేక వస్తున్నాయంటేనే అర్థం అవుతోంది ఆమెకు ప్రజల మీద ఎంత ప్రేమో.. విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు, కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనేగా ఈ ఏడుపు డైవర్షన్లు?
నిజమే.. జగన్ లాంటి అన్న ఎవరుంటారు?
ఏ అన్న అయినా... చెల్లికి గిఫ్ట్ అంటే ఏ బంగారమో, చీరనో ఇస్తారని, అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా? నా హక్కు కాబట్టే నాకు ఇస్తామన్నారని షర్మిల అంటున్నారు. నిజమే ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న రోజులివి. అలాంటి కలికాలంలోనూ చెల్లిలికి తన సొంత ఆస్తి నుంచి, కష్టార్జితం నుంచి వాటా ఇస్తాననే అన్న బహుశా ఒక్క జగన్ తప్ప ఎవరూ ఉండరేమో.
అది కూడా ఆమెకు పెళ్లి జరిగిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన 10 ఏళ్లు అయిపోయాక అంటే నిజంగా చెల్లిలి మీద ఎంత ప్రేముంటే ఇంతటి నిర్ణయం తీసుకుంటారు..? పైగా అడగకుండానే ఎంవోయూ రాసిచ్చారని మీరే అంటున్నారంటే, అంత చిత్తశుద్ధి ఉన్న అన్న ఇంకెవరుంటారు.
మీ లేఖను టీడీపీ విడుదల చేయడమేమిటి?
ఐదేళ్లు ఎంవోయూ చేతిలో ఉన్నా ఏ మీడియాకు విడుదల చేయని షర్మిల.. అన్నకు రాసిన లేఖను మాత్రం టీడీపీ అధికారికంగా ఎలా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ లేఖ, ఆమె కాకుండా టీడీపీ అధికారికంగా ఎలా బయటపెడుతుంది. అంటే కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటేనని మీరే చెప్పినట్టు కాదా.?
మీరు చేస్తున్నది ఏమిటి...?
జగన్ సొంత లబ్ధి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారంటున్నారే మరి మీరు చేస్తున్నదేమిటి. మీ లబ్ధి కోసం, మీరు మోస్తున్న చంద్రబాబు లబ్ధి కోసం సొంత అన్న బెయిల్‌ను రద్దు చేయించి జైలుకు పంపాలనుకోవడం లేదా? ఇందుకోసం మీరు మీ తల్లి విజయమ్మను వాడుకోవడం లేదా..? దీన్నేమనాలి?
మీరేం త్యాగాలు చేశారు?
వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడానికి మీ త్యాగాలు, కష్టమే కారణమా షర్మిల. మీరు పదేళ్లలో అన్న ఇచ్చిన రూ.200 కోట్లు తీసుకున్నారు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తులతో వ్యాపారాలు చేసుకున్నారు. అదేనా మీ త్యాగం? అన్నంటే ప్రాణం అంటూనే అన్న చేసిన సాయాన్ని మర్చిపోయి కుట్రలు చేయడమేనా మీ నైజం? మీరు సంపాదించుకున్న ఆస్తుల్లో జగన్ వాటా అడిగితే మీకెలా ఉంటుంది?.
Comments
Please login to add a commentAdd a comment