మతిస్థిమితం లేని వ్యక్తితో మాట్లాడుతున్న చిట్యాల ఎస్‌ఐ నాగరాజు
సాక్షి, చిట్యాల (నల్లగొండ): మండల పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామ శివారు జాతీయ రహదారిపై సోమవారం ఓ వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా సంచరిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిట్యాల ఎస్‌ఐ నాగరాజు అక్కడికి చేరుకుని ఆ మతిస్థితిమితం లేని వ్యక్తిని చేరదీశాడు. అతడిని వివరాలు అడగగా ఆంగ్లంలో మాట్లాడాడు. తన పేరు డాక్టర్ రాజా అని, ఐఐటీ, పీహెచ్‌డీ చేశానని, తమిళనాడు అని చెప్పాడు.
అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి దుస్తులు సమకూర్చి భోజనం పెట్టించి ఆకలి తీర్చాడు. అతడు చెబుతున్న వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసిన ఎస్‌ఐని పలువురు అభినందించారు.
వృద్ధురాలిని ఇంటికి చేర్చి..
డిండి: నాంపల్లి మండలం సల్లోనికుంటకు చెందిన వృద్ధురాలు రాపోతు వెంకటమ్మ చిత్రియాలలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో దారితప్పి డిండికి చేరుకుంది. మతిస్థిమితం లేకుండా బంగారు ఆభరణాలతో డిండి గ్రామశివారులో తిరుగుతున్న సదరు వృద్ధురాలిని స్థానిక యువకుడు ఆవుట అంకాల్ గమనించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పాడు.
వెంటనే స్పందించిన పోలీసులు వివారాలు సేకరించగా వృద్ధురాలు కూతురైన మండల పరిధిలోని వీరబోయనపల్లి గ్రామానికి చెందిన జంగా లక్ష్మమ్మగా గుర్తించారు. ఆమెను స్టేషన్‌కు పిలిపించి వెంకటమ్మను అప్పగించారు. కార్యక్రమంలో డిండి ట్రైనీ ఎస్‌ఐ.కళ్యాణ్ కుమార్, మహిళ సహాయకేంద్రం ఇన్‌చార్జ్ సైదమ్మ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment