Old Age Woman
-
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
Viral Video: భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని బండి నడిపిన బామ్మ..
బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. బైక్ అంటే చాలు కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. ఒకప్పుడు మగవారే బైక్‌లు, కారులు నడిపేవారు. అమ్మాయిలు అసలు రైడింగ్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా అన్ని వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా వయసు పైబడిన పెద్దావిడ బండి నడిపి వావ్ అనిపించింది. అంతేగాక వెనుక సీట్లో తాతను కూర్చోబెట్టి బామ్మ డ్రైవ్ చేయడం మరింత స్పెషల్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో సుమారు 60 ఏళ్లు ఉన్న ఓ పెద్దావిడ ఎంతో ఉత్సాహంగా, చలాకీగా ద్విచక్ర వాహనం నడిపింది. భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని రోడ్డుపై రయ్ రయ్ అంటూ వెళ్లింది. బామ్మ చక్కగా చీరకట్టుకొని ఉండగా తాత తెల్లటి చొక్కా, పంచె కట్టుకొని కనిపించాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మగా మారిపోయింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా బండి నడిపి.. యువకులకు తాను ఎంత మాత్రం తీసిపోనని రుజువు చేసింది. దీనిని వెనకాల వస్తున్న వారు వీడియో తీశారు. సుస్మితా డోరా అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. బామ్మ డ్రైవింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఈ వయసులో బండి నడపడటం గ్రేట్..చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్‌కు తిరుగు లేదు’ అంటూ ప్రశంసిస్తున్నారు. కపుల్ గోల్స్ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. బండి నెంబర్ ప్లేట్ చూస్తుంటే తమిళనాడుకు చెందినదిగా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Susmita Dora (@the_aspiring_seed) -
శభాష్ ఎస్సై నాగరాజు.. ఆకలి తీర్చి.. ఆరాతీసి
సాక్షి, చిట్యాల (నల్లగొండ): మండల పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామ శివారు జాతీయ రహదారిపై సోమవారం ఓ వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా సంచరిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిట్యాల ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకుని ఆ మతిస్థితిమితం లేని వ్యక్తిని చేరదీశాడు. అతడిని వివరాలు అడగగా ఆంగ్లంలో మాట్లాడాడు. తన పేరు డాక్టర్ రాజా అని, ఐఐటీ, పీహెచ్డీ చేశానని, తమిళనాడు అని చెప్పాడు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి దుస్తులు సమకూర్చి భోజనం పెట్టించి ఆకలి తీర్చాడు. అతడు చెబుతున్న వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసిన ఎస్ఐని పలువురు అభినందించారు. వృద్ధురాలిని ఇంటికి చేర్చి.. డిండి: నాంపల్లి మండలం సల్లోనికుంటకు చెందిన వృద్ధురాలు రాపోతు వెంకటమ్మ చిత్రియాలలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో దారితప్పి డిండికి చేరుకుంది. మతిస్థిమితం లేకుండా బంగారు ఆభరణాలతో డిండి గ్రామశివారులో తిరుగుతున్న సదరు వృద్ధురాలిని స్థానిక యువకుడు ఆవుట అంకాల్ గమనించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు వివారాలు సేకరించగా వృద్ధురాలు కూతురైన మండల పరిధిలోని వీరబోయనపల్లి గ్రామానికి చెందిన జంగా లక్ష్మమ్మగా గుర్తించారు. ఆమెను స్టేషన్‌కు పిలిపించి వెంకటమ్మను అప్పగించారు. కార్యక్రమంలో డిండి ట్రైనీ ఎస్ఐ.కళ్యాణ్ కుమార్, మహిళ సహాయకేంద్రం ఇన్చార్జ్ సైదమ్మ ఉన్నారు. చదవండి: Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం -
సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన బిరుదుల హన్మక్క (65) వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుమారుడుకాగా అదే గ్రామంలో మరోచోట నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి హన్మక్కను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి ఇంటి సమీపంలోని మురికికాలువలో పడేశారు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై చిరంజీవి గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. మృతురాలి కొడుకు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు విచారణ వేగవంతం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను పోలీసులు ఏర్పాటు చేశారు. -
బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ..
మోత్కూరు: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లిని బతికుండగానే బొంద పెడతానంటూ ఓ కొడుకు గొయ్యి తవ్విన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బుచ్చిమల్లయ్య, సాలమ్మ, దంపతులకు ముగ్గురు కుమారులు నర్సింహ, ఐలయ్య, వెంకటయ్యతోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం బుచ్చిమల్లయ్య మృతి చెందాడు. ముగ్గురు కుమారులు కలిపి నెలకు రూ.600 చొప్పున ఆరు నెలలకోసారి 3,600 రూపాయలను జీవనభృతి కింద తల్లికి ఇస్తున్నారు. చిన్నకుమారుడు వెంకటయ్య నాలుగైదేళ్లుగా తన వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ గత నెల 16న వెంకటయ్య తన భార్యతో కలసి పొలం వద్ద ఉన్న తండ్రి సమాధి పక్కనే బొంద తీశాడు. ఈ విషయమై గ్రామపెద్దలు వెంకటయ్యను తీవ్రంగా మందలించడంతో బొందను పూడ్చివేశాడు. జీవనభృతి ఇవ్వడంలేదని వెంకటయ్యపై తల్లి గత నెల 30న యాదాద్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. -
అయ్యాసార్లు కాళ్లు మొక్కుతా.. పింఛన్ ఇయ్యిండ్రి..
సాక్షి, తంగళ్లపల్లి(కరీనంగర్): మంచానికే పరిమితమైన తల్లిదండ్రులకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని తనయుడు వేడుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక కనీసం ఒక్కపూట భోజనం అందించలేని స్థితిలో ఉన్నానని ఆర్థికసాయంకోసం ఎదురుచూస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పెకుడ యాదయ్య(58) –రాదవ్వ(54) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు అంజమ్మ, మమత, కొడుకు రాజు సంతానం. కూతుర్ల వివాహాలుకాగా 22 ఏళ్ల కొడుకు రాజు అవివాహితుడు. పదేళ్లక్రితం రాదవ్వ వ్యాధిబారిన పడి రెండుకాళ్లు పని చేయకుండా మంచానపడింది. యాదయ్య, రాజు ఇన్నాళ్లూ బతుకు బండి లాగిస్తున్నారు. ఒకరు పనికి వెళ్తే మరొకరు రాదవ్వను చూసుకునేవారు. కుటుంబంపై విధి పగబట్టింది. యాదయ్య కూడా రెండునెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వీరిద్దరి బాధ్యత రాజుపై పడింది. ఆకలితో పోరాటం రాజు బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్కులో పవర్లూమ్ కార్మికుడిగా, టాకాలు పట్టే కార్మికుడిగా, వాచ్‌మన్‌గా పనులు చేశాడు. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు వచ్చేవి. తల్లిదండ్రుల మందులకే రూ.10 వేలు ఖర్చు అయ్యేవి. ప్రస్తుతం తల్లిదండ్రులను వదిలి పనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఆర్థికపరిస్థితి క్షీణించింది. తినడానికి తిండి లేని దుస్థితి ఏర్పడింది. తోడబుట్టిన వారు పలుమార్లు ఆర్థికంగా ఆదుకున్నా..నెలకు రూ.10 వేలు మందులకు ఖర్చు అవుతుండడం రాజుకు భారంగా మారింది. వ్యవసాయ కాలేజీ నిర్మాణంలో పోయిన భూమి పెకుడ యాదయ్యకు జిల్లెల్ల శివారులో 1 ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి ఉండగా వ్యవసాయ కాలేజీ నిర్మాణ సమయంలో ప్రభుత్వం తీసుకుంది. రాళ్లు రప్పలు కలిగిన ప్రాంతంలో 1:20 ఎకరం భూమిని ప్రభుత్వం ఇవ్వగా అది వ్యవసాయ యోగ్యంకాకపోవడంతో ఎందుకు పనిరాకుండా ఉంది. రాదవ్వ అంగవైకల్యంతో బాధపడుతుండగా, యాదయ్య రెండునెలలుగా కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. వీరిద్దరు పింఛన్ పొందేందుకు అర్హులు. కాళ్లు మొక్కుత పింఛన్ ఇయ్యిండ్రి.. అయ్యాసార్లు కాళ్లు మొక్కుతా..పదేండ్ల సంది మంచంలనే ఉంటున్న. ఒక్క పోరడు కన్న తండ్రి లెక్క అన్ని చేస్తుండు. తినడానికి తిండి కూడా లేదు దయచేసి పింఛన్ ఇప్పిస్తే ఒక్కపూట తిండైనా దొరుకుతది. – పెకుడ రాదవ్వ, జిల్లెల్ల ఆదుకోండ్రి సారు అమ్మనాయినలను కాపాడుకుంటా దయచేసి ఆర్థికంగా సాయాన్ని అందించండి. ప్రభుత్వం తరఫున ఏదైనా ఆర్థికసాయం చేయండి. చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తే నా తల్లిదండ్రులను సాదుకుంటా..సాయం చేయండి. పేదరికంలో ఉన్నాం. దాతలు ఆదుకోండి. – పెకుడ రాజు, జిల్లెల్ల -
అవ్వకు ఆసరగా గుమ్మం వద్దకే పింఛన్
-
ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామక్క(60) అనే వృద్ధురాలు శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. రామక్క తన గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబసభ్యులు ఈ రోజు ఉదయం గమనించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాయమాటలు చెప్పి బంగారం అపహరణ
బేతంచెర్ల (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా బేతంచెర్లలోని పాత బస్టాండు సమీపంలో ముగ్గురు మహిళలు మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి నుండి సుమారు 20 తులాల బంగారు నగలను అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. బేతంచెర్లకు చెందిన రావూరి అనసూయమ్మ అనే వృద్ధురాలు తన పుట్టినిల్లు అయిన బనగానపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి పరిచయమయ్యారు. అనారోగ్యం నయం చేస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత వృద్ధురాలు బేతంచెర్ల పాత బస్టాండుల్లో బస్సు దిగిన తరువాత ఆమెనే అనుసరిస్తూ వెళ్లిన వారు.. ఆమె ముఖంపై మత్తుమందు చల్లి తమ వెంట తీసుకెళ్లి శేఖర్ వైన్ షాపు పక్కన ఆమె మెడ, చేతులకు ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మత్తులో నుండి తేరుకునేలోపే వారు పారిపోయారని లబోదిబోమంటూ ఆ వృద్ధురాలు వాపోయింది. పట్టణ నడిబొడ్డున ఈ సంఘటన చోటుచేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.