కర్నూలు జిల్లా బేతంచెర్లలోని పాత బస్టాండు సమీపంలో ముగ్గురు మహిళలు మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి నుండి సుమారు 20 తులాల బంగారు నగలను అపహరించారు.
బేతంచెర్ల (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా బేతంచెర్లలోని పాత బస్టాండు సమీపంలో ముగ్గురు మహిళలు మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి నుండి సుమారు 20 తులాల బంగారు నగలను అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. బేతంచెర్లకు చెందిన రావూరి అనసూయమ్మ అనే వృద్ధురాలు తన పుట్టినిల్లు అయిన బనగానపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి పరిచయమయ్యారు. అనారోగ్యం నయం చేస్తామంటూ మాయమాటలు చెప్పారు.
ఆ తర్వాత వృద్ధురాలు బేతంచెర్ల పాత బస్టాండుల్లో బస్సు దిగిన తరువాత ఆమెనే అనుసరిస్తూ వెళ్లిన వారు.. ఆమె ముఖంపై మత్తుమందు చల్లి తమ వెంట తీసుకెళ్లి శేఖర్ వైన్ షాపు పక్కన ఆమె మెడ, చేతులకు ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మత్తులో నుండి తేరుకునేలోపే వారు పారిపోయారని లబోదిబోమంటూ ఆ వృద్ధురాలు వాపోయింది. పట్టణ నడిబొడ్డున ఈ సంఘటన చోటుచేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.