దొంగలను అరెస్ట్ చూపుతున్న పోలీసులు, చిత్రంలో స్వాధీనం చేసుకున్న బైక్‌లు
మహానంది: టీవీ, బైక్ మెకానిక్‌లమంటూ ఊళ్లల్లో తిరుగుతారు. తయారు చేస్తామంటూ నమ్మబలుకుతూ టీవీలో మదర్‌బోర్టులు తీసుకునివెళ్లి కనిపించరు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. టీవీల్లోని మదర్‌బోర్డులతో పాటు వివిధ జిల్లాలోని బైక్‌లను చోరీ చేస్తున్నది తండ్రీ కొడుకులేనని తేలింది. వారిని చాకచక్యంగా పట్టుకొని సోమవారం బోయిలకుంట్ల మెట్ట వద్ద అరెస్ట్ చేశారు. నంద్యాల రూరల్ సీఐ మల్లికార్జున, మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పెద్దగోటిపాడు గ్రామానికి చెందిన గుండుపల్లి వెంకటప్రసాద్ చౌదరి, ఆయన కుమారుడు గుండుపల్లి చందు.. మహానంది మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి, పెద్దలింగమయ్య, శంకర్‌రెడ్డి టీవీలను మరమ్మతులు చేస్తామని నమ్మించారు.
మదర్‌బోర్డులను తీసుకుని వెళ్లి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన రమేష్‌రెడ్డి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి..కేసు నమోదు చేసుకొని ఫోన్ నంబరు ఆధారంగా విచారణ చేశారు. బోయిలకుంట్ల మెట్ట వద్ద తండ్రీ కొడుకులు ఉన్నట్లు తెలుసుకొని అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు బైకులు, టీవీలలో ఉన్న మదర్‌బోర్డులును స్వాధీనం చేసుకున్నారు. వీరు రెండురాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లా జోగులాంబ ఆలయం వద్ద ఒక బైక్, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఇంకో బైక్, ఒంగోలు బైపాస్ రోడ్డులో మరో బైక్ చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరిపై ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నాలుగు కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment