పాణ్యం చెంచు కాలనీ వ్యూ
కర్నూలు (అర్బన్):
ఇదెలా సాధ్యమయ్యిందంటే..
ఈ చెంచులను చూసి అప్పట్లో నంద్యాలలో డీఎస్పీగా పనిచేస్తున్న కాశీనాథ్ చలించిపోయారు. వీరికి పునరావాసం కల్పించి సన్మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు జిల్లా కలెక్టర్ పాణ్యంలో ప్రత్యేకంగా చెంచు కాలనీ ఏర్పాటు చేసి, 43 ఎకరాల భూమిని కేటాయించారు. వీరికి వ్యవసాయం నేర్పేందుకు జిల్లా గిరిజన సంక్షేమాధికారికి బాధ్యతలు అప్పగించారు. సాగుకు అనుకూలంగా రెండు బోర్లు వేయడంతో పాటు గోరుకల్లు రిజర్వాయర్ నీటితో చెంచులకు వ్యవసాయం కలిసివచ్చింది. అప్పట్లో దొంగలుగా ముద్ర పడిన చెంచులు.. నేడు రైతులుగా దర్జాగా జీవనం సాగిస్తున్నారు.
నాడు...
పిడికెడు మెతుకుల కోసం.. ఎండల్లో ఎండుతూ, వానల్లో తడుస్తూ అడవుల్లోనే మగ్గిపోయారు. చదువు లేదు, ప్రభుత్వ పథకాలంటే తెలియదు. కొందరు అడవుల్లో పక్షులు, చిన్న చిన్న జంతువులను వేటాడితే, మరి కొందరు భూస్వాముల పొలాలకు కాపాలాగాళ్లుగా జీవనం గడిపేవారు. ఒకరిద్దరి తప్పిదం వల్ల కర్నూలు– నంద్యాల రహదారిపై, నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా, పోలీసులు వీరినే అనుమానించి స్టేషన్‌కు తీసుకువెళ్లి కేసులు నమోదు చేసేవారు. ఇదంతా.. 40 ఏళ్ల కిందటి మాట.
నేడు...
పాణ్యంలో ప్రత్యేకంగా ఏర్పడిన చెంచు కాలనీలోని మెజారిటీ ఇళ్లలో ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మిషన్, గ్యాస్ స్టవ్‌లు దర్శనమిస్తున్నాయి. దాదాపు 20 మంది యువకులు సొంత ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కాలనీకి చెందిన వారిలో.. ఇద్దరు అంగన్‌వాడీలు, నలుగురు వలంటీర్లు, ఒక హోంగార్డు, ఒకరు ప్రభుత్వ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్, మరొకరు గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ప్రిన్సిపాల్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు.
పొలం కావలికి 10 పళ్ల వడ్లు ఇచ్చేవారు
40 ఏళ్ల కిందట కొండజూటూరు గ్రామ పరిసరాల్లోని అడవుల్లో ఉండేవాళ్లం. అక్కడి రైతుల పొలాలకు రాత్రి, పగలు కావలి కాస్తే ఒక ఎకరాకు 10 పళ్ల (8 కేజీలు) వడ్లు ఇచ్చేవారు. కావలి పనులు చేస్తున్నా.. ఎక్కడ దొంగతనాలు జరిగినా, పోలీసులు మమ్మల్నే తీసుకుపోయేవారు.
– దాసరి పెద్ద ఓబులేసు
కాశీనాథ్, సుధాకరయ్య కృషి వల్లే..
అడవుల్లో దుర్భరమైన జీవితాలను గడుపుతున్న మా అభివృద్ధికి అప్పటి నంద్యాల డీఎస్పీ కాశీనాథ్, పాణ్యం గ్రామ పెద్ద సుధాకరయ్య ఎంతో కృషి చేశారు. ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయించి, వ్యవసాయ భూమిని ఇప్పించారు.
– మేకల సుబ్బరాయుడు, మాజీ సర్పంచ్
30 నుంచి 40 బస్తాలు పండిస్తున్నా..
ప్రభుత్వం ఇచ్చిన ఎకరా భూమికి తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని.. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల ధాన్యాన్ని పండిస్తున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
– దాసరి చిన్నన్న
చెంచు చిన్నారులకు విద్యను అందించడమే ధ్యేయం
నేను డిగ్రీ, బీఎడ్ వరకు చదివా. ప్రస్తుతం గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నా. చెంచు చిన్నారులందరినీ విద్యావంతులను చేయడమే ధ్యేయం.
– టి.మాధవి, ప్రిన్సిపాల్, గిరిజన సంక్షేమ మినీ గురుకులం, నెరవాడమెట్ట, పాణ్యం మండలం
Comments
Please login to add a commentAdd a comment