![Police Arrested Mobile Thiefing Gang In Kurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/5/man.jpg.webp?itok=6fsDyF96)
సాక్షి,కర్నూలు: నగరంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బబ్లూ బ్యాచ్, వడ్డె ప్రసాద్ బ్యాచ్ పేరుతో ఎనిమిది మంది కొంతకాలంగా నగరంలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన కొత్తూరు శేఖర్‌రెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని కర్నూలులో రిపేరికి ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆటో ఎక్కాడు. అదే దారిలో కొంచెం ముందుకు వెళ్లిన తరువాత సర్వీసు రోడ్డులో నుంచి చీకట్లోకి తీసుకెళ్లి రూ.5 వేలు నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు.
అలాగే తుగ్గలికి చెందిన జయచంద్ర రిలయన్స్ మార్ట్‌లో పనిచేస్తాడు. కేసీ కెనాల్ వద్ద అతని వద్ద నుంచి రూ.6 వేల నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి శ్రీధర్‌పై కూడా ఈ తరహాలోనే దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కున్నారు. రెండు నెలల వ్యవధిలో ఈ తరహా మూడు కేసులు నమోదు కావడంతో మూడో పట్టణ ఎస్‌ఐ రామకృష్ణ, క్రైంపార్టీ సిబ్బంది ప్రసాద్‌సింగ్, చంద్రబాబునాయుడుతో కలిసి నిఘా వేసి పవన్ అలియాస్ బబ్లూ, వడ్డె ప్రసాద్(శ్రీరామ్‌నగర్)లతో పాటు కావేటి ఈశ్వరయ్య (లక్ష్మీనగర్), దాస్(జంపాల శివనగర్), అఖిల్ (ఎన్టీఆర్ బిల్డింగ్స్), మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు. చోరీ చేసిన సెల్‌ఫోన్లను అమ్మ హాస్పిటల్‌కు సమీపంలోని సాయి మొబైల్స్‌లో సెల్‌ఫోన్ మెకానిక్ గౌడుకు విక్రయించినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 10 సెల్‌ఫోన్లతో పాటు ఆటో, స్కూటర్ స్వాధీనం చేసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment