వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో పెరుగుతున్న చోరీలు
మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలోనూ అదే పరిస్థితి
రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచితేనే చోరీలకు అడ్డుకట్ట
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి
వరంగల్ జిల్లా నర్సంపేటలో కొద్దిరోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో నగదు, బంగారం పోయింది. అయితే నిందితులను పట్టుకున్నాం. ఇటీవల వరంగల్ వెస్ట్‌జోన్ పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి రూ.22.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో చోరీల నివారణకు విజిబుల్ పోలీసింగ్ పెంచుతున్నాం. ఠాణాల వారీగా కూడా సమీక్షిస్తున్నాం. ఎవరైనా విధులు సరిగా నిర్వర్తించకపోతే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీసు కమిషనర్. వరంగల్
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో నమోదవుతున్న చోరీల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన ఈ విజిబుల్ పోలీసింగ్‌లో.. ముఖ్య నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో పోలీసులు, పెట్రోకార్, బ్లూకోల్ట్ సిబ్బంది.. తరచూ పర్యటిస్తూ నిఘా పెంచితే దొంగల్లో భయం పుడుతుంది. అదే సమయంలో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుంది. ఇలా విజిబుల్ పోలీసింగ్‌తో దొంగతనాలతో పాటు నేరాలు తగ్గే అవకాశముంది.
సిబ్బంది.. పెట్రోలింగ్ పెరగాలి
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో విస్తరించిన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 150 చోరీలు జరిగాయి. మహబూబాబాద్‌లో 182, ములుగు 131, భూపాలపల్లి 78 చోరీ కేసులు నమోదయ్యా యి. గతేడాదితో పోల్చుకుంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది.
కానీ.. చోరీ కేసుల ఛేదనలో కీలకమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సిబ్బంది కొరత వల్ల కూడా దొంగలు పేట్రేగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిటాచ్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ల నియామకం లేకపోవడం కూడా చోరీలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇంకోవైపు సమయాల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో చేయకపోవడం దొంగలకు వరంగా మారిందన్న విమర్శలున్నాయి.
ఫ్రెండ్లీ పోలీసింగ్ తరహాలోనే విజిబుల్ పోలీసింగ్ ద్వారానే నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అంతగా అమలు కాకపోవడంతో దొంగతనాలు పెరిగేందుకు అస్కారం ఏర్పడింది. ఇంకా చాలావరకు చిన్నచిన్న దొంగతనాల కేసులు నమోదు కాలేదన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment