పాకిస్తాన్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడ సాధారణ పౌరులకు కూడా భద్రత లేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక విదేశీ పర్యాటకుల సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్‌లో జరిగిన ఓ లూటీ సంచలనంగా మారింది.
జర్మనీకి చెందిన పర్యాటకుడు బెర్గ్ ఫ్లోరిన్ పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వచ్చాడు. అయితే అతని దగ్గరున్న విలువైన వస్తువులను ఎవరో దోచుకెళ్లడంలో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులకు ఒక విషయం తెలిసే సరికి వారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లాహోర్ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో.. నలుగురు పోలీసులు ఉన్నారని తెలియడంతో వారు కంగుతిన్నారు.
వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన 27 ఏళ్ల బెర్గ్ ఫ్లోరిన్ వారం రోజులుగా లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో క్యాంప్ వేసుకుని ఉంటున్నాడు. కొంతమంది దుండగులు ఆయుధాలతో బెదిరించి, ఫ్లోరిన్ దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ పోన్‌తో పాటు కెమెరాను దోచుకెళ్లారు. దీనిపై లాహోర్ పోలీసులకు ఫ్లోరిన్ ఫిర్యాదు చేశాడు. తాను సైకిల్‌పై పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నట్లు ఫ్లోరిన్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 3వ తేదీన రాత్రి రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నానని, ఈ సమయంలో కొందరు ఆయుధాలతో తన దగ్గరకు వచ్చి తన విలువైన్ ఫోను, కెమెరాను లాక్కెళ్లి పోయారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ విదేశీ పౌరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ జర్మన్ పౌరుడిని దోచుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ బిలాల్ సిద్ధిఖీ కమ్యానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దోపిడికీ పాల్పడినవారితో జతకట్టిన నలుగురు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారికి మిగిలిన దోపిడీ దొంగలతో సంబంధం ఉందా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment