పెషావర్ : పాకిస్తాన్‌లో ముస్లింలకు ముస్లింలే శత్రువులుగా మారారు. ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో సున్నీ- షియా వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాక్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ అలీజాయ్- బగన్ వర్గాల మధ్య ఘర్షణలు గత వారం శుక్రవారం ప్రారంభమయ్యాయి. గత శుక్ర, శనివారాల్లో జరిగిన హింసాకాండలో 37 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గురువారం కాన్వాయ్‌పై జరిగిన దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.
ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి షియా, సున్నీ వర్గాల పెద్దలకు మధ్య జరిగిన సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ అక్కడక్కడా ఘర్షణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. తాజాగా మంగళవారం ఘోజాగరి, మతాసానగర్, కుంజ్ అలీజాయి ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కుర్రం డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ మాట్లాడుతూ, హంగూ, ఒరాక్జాయ్, కోహట్ జిల్లాలకు చెందిన మత పెద్దల సమక్షంలో శాంతి చర్చలు జరగనున్నాయని తెలిపారు. దీనికి కోహట్ కమిషనర్ నాయకత్వం వహించనున్నారని తెలిపారు.
మరోవైపు ఈ ఘర్షణల తరువాత పరాచినార్‌కు వెళ్లే రహదారులను మూసివేయడంతో మందుల కొరత ఏర్పడిందని కుర్రం జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీర్ హసన్ ఖాన్ తెలిపారు. సున్నీ ఆధిపత్యం కలిగిన పాకిస్తాన్‌లోని 24 కోట్ల జనాభాలో షియా ముస్లింలు 15 శాతం ఉన్నారు. సాధారణంగా ఇరువర్గాలు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నప్పటికీ, ముఖ్యంగా కుర్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత హింస భూ వివాదంతో ముడిపడి ఉంది.
ఇది కూడా చదవండి: భారత్‌లో ప్లాంట్లు పెట్టండి
Comments
Please login to add a commentAdd a comment