న్యూఢిల్లీ: మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్‌కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు.
దీంతో పాకిస్తాన్‌లో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్ర సృష్టించారు. ఈ నేపధ్యంలో రాజేందర్ మేఘ్వార్ భారత్‌లోనూ వార్తల్లో నిలిచారు. రాజేందర్ తాను పాక్‌లో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్‌లోని ఫైసలాబాద్ పోలీస్‌శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రాజేందర్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని బాడిన్‌కు చెందిన రాజేందర్ మేఘ్వార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలు సులభంగా తెలుస్తాయని, అప్పుడే వాటిని పరిష్కరించగలనని రాజేందర్ మేఘ్వార్ తెలిపారు.
ఒక పోలీసు అధికారిగా తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో పాక్‌లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా రాజేందర్ మేఘ్వార్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రహీమ్ యార్ ఖాన్‌కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది?
Comments
Please login to add a commentAdd a comment