సాక్షి, కర్నూలు: కంటైనర్ హైవేలపైకి చేరగానే వాళ్లూ హైవేపైకి దూసుకొస్తారు. రన్నింగ్ వెహికల్స్ లోనే తమ పని పూర్తి చేసుకొని జారుకుంటారు. ఉదయాన్నే వస్తువుల్ని డెలివరీ చేసేందుకు ఆ కంటైనర్ ఓపన్ చేసి చూస్తేగానీ చోరీ జరిగిన విషయం బయటపడదు. ఈ తరహా చోరీలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. కర్నూల్ నేషనల్ హైవేపై ఏ స్థాయిలో దారిదోపిడీలు జరుగుతాయో ఓ వాహనానికి అమర్చిన సీసీటీవీ సాక్షిగా బయటపడింది. యాక్షన్ మూవీలను తలదన్నే రియల్ యాక్టివిటీ ఇది. వాహనం రన్నింగ్‌లోనే ఉంది. ఓ గ్యాంగ్ బైక్‌పై వచ్చి కంటైనర్ వాహనాన్ని అందుకున్నాడు. ఓ తన గ్యాంగ్ కిందపడిపోవడంతో చోరీకి బ్రేక్ పడింది. దీంతో హైస్పీడ్‌లోనూ చిన్న టెక్నిక్‌తో కిందికి దిగేశాడు ఈ దొంగ.
కర్నూల్ హైవేపై నిత్యం ఇలాంటి భారీ కంటైనర్స్ రకరకాల వస్తువులతో వెళ్తుంటాయి. ఇళ్లను టార్గెట్ చేస్తే పెద్దగా వర్కవుట్ అవ్వదని భావిస్తున్న దొంగలు.. హైవేలపై వెళ్లే వస్తువుల కంటైనర్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీలు కొరియర్ సర్వీసులకు పెద్ద ముప్పుగా మారాయి. డీటీడీసీ కొరియర్, వరల్డ్ ఫస్ట్ ఫ్లైట్ వంటి బ్రాండెడ్ కొరియర్ సర్వీసులకు దొంగల భయం నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కొరియర్ సర్వీసుల్లో ఖరీదైన వస్తువులు వెళ్తుంటాయి. వాటిని ఇలాంటి గ్యాంగులు కొట్టేస్తున్నాయి. ఇటీవలే రెండు కంటైనర్లలో 50 లక్షల విలువ చేసే వస్తువుల్ని ఎత్తుకెళ్లిపోయారు.
ఏ కంటైనర్ ఎక్కడికి వెళ్లుతుంది, ఏ వాహనలో ఎలక్ట్రానిక్ గూడ్స్ వెళ్తుంటాయో పక్కాగా రెక్కీ నిర్వహిస్తారు. ఒక అద్దె కంటైనర్‌ను తమ వెంట హైవై మీదకు తీసుకెళ్లి రిహార్సల్స్ చేస్తారు. వేగంగా వెళ్తున్నప్పుడు ఎలా కంటైనర్ తెరవాలి.. వస్తువుల్ని ఎలా కొట్టేసి జాగ్రత్తగా కిందికి దించాలి.. మళ్లీ ఎలా తప్పించుకోవాలని ప్రాక్టీస్ చేస్తారు. ఇదంతా రాత్రి వేళల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే కడప నుండి హైదరాబాద్ వెళ్తున్న డీటీడీసీ కొరియర్ వాహనాన్ని మైదుకూరు వద్ద టీ త్రాగడానికి కాసేపు ఆపిన డ్రైవర్.. ఒంటి గంట సమయంలో కొరియర్ ఆఫీసుకు చేరుకొని డోర్ తీశాడు. అంతే.. వస్తువులు చోరీ అయ్యాయి. వరల్డ్ ఫస్ట్ ఫ్లైట్ కొరియర్ సర్వీస్ కంటైనర్‌కు కూడా ఇదే పరిస్థితి.. నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్న తమ్మరాజు పల్లె వద్ద కంటైనర్‌పై అటాక్‌కు ప్రయత్నించారు. అయితే ప్రమాదం జరగడంతో ఈ చోరీకి బ్రేక్ పడింది. ఈ తతంగమంతా ఆ కంటైనర్‌కు అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు దాదాపు అన్ని కంటైనర్లకూ సీసీటీవీలు అమర్చి.. ఒక మనిషి అదేపనిగా పర్యవేక్షిస్తున్నారు. అయినా సరే కొందరు కేటుగాళ్లు ఆ సీసీ కెమెరాలను పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. దీంతో హైవే దొంగల్ని పట్టుకోవడం.. వస్తువుల్ని తీసుకెళ్లే వాహనాలకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment