Courier Service
-
రవాణా ఛార్జీలు పెంపు!
ప్రముఖ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టం చేసింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ఇన్పుట్ ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలిక వ్యయాలు అధికం అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలను దాదాపు 9-12 శాతం పెంచాలని నిర్ణయించారు. జనవరి 1, 2025 నుంచి ఈ ధరల పెంపు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి, వారికి మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ ధరల పెంపు చాలా అవసరం. ఇది కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు -
కొరియర్లో డ్రగ్స్ సరఫరా
హైదరాబాద్: దుస్తుల మధ్య మాదక ద్రవ్యాలు పెట్టి కొరియర్ సర్వీస్‌లు, ప్రైవేట్ బస్సులలో సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ దీపారాం బిష్ణోయ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.60 లక్షలు విలువ చేసే 70 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏ, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడి ఖాతాలోని రూ.3.21 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. వివరాలను బుధవారం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ► రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో ఉంటూ ఎస్ఎస్ రెయిలింగ్ గ్రానైట్ వ్యాపారం ప్రారంభించాడు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన ఇతగాడు క్రమంగా పెడ్లర్‌గా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన డ్రగ్ సప్లయర్ రమేష్ కుమార్‌తో బిష్ణోయ్‌కి పరిచయం ఏర్పడింది. ఇతని నుంచి గ్రాము హెరాయిన్‌ను రూ.5–6 వేలకు కొనుగోలు చేసి, అక్రమ మార్గంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి రూ.8–10 వేలకు విక్రయించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ► పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఆన్లైన్లో ఆర్డరు తీసుకుంటూ.. ప్రైవేట్ బైక్ షేరింగ్ కంపెనీల ద్వారా డ్రగ్స్‌ను కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. బుధవారం విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), చైతన్యపురి పోలీసులు టెలిఫోన్ కాలనీ సమీపంలో నిందితుడు బిష్ణోయ్‌ను పట్టుకున్నారు. అతని నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. నిందితుడు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు. పలువురు ప్రైవేట్ షేరింగ్ కంపెనీల ప్రతినిధులను కూడా నిందితులుగా చేర్చనున్నారు. -
కొరియర్ వచ్చిందని చెప్పి..
సాక్షి, లంగర్‌హౌస్: కొరియర్ వచ్చిందంటూ పలు మార్లు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడిని లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఐ ముజీబ్ ఉర్ రెహమాన్, డీఎస్సై రాఘవేంద్ర స్వామిలతో కలిసి ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతి వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన సయ్యద్ హమీద్ మెహిదీపట్నంలోని ఓ హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతను తన తమ్ముడి ఫీజు కట్టడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను డెలివరీ చేసే ప్రాంతాలను పరిశీలిస్తూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. నెల రోజుల క్రితం మారుతీ నగర్‌లోని ఓ ఇంట్లో డెలివరీ ఇచ్చాడు. సదరు వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో పలుమార్లు అక్కడ చోరీకి ప్రయత్నించిన విఫలమయ్యాడు. ఈ నెల 23న మరోసారి ఆమె ఇంటికి వెళ్లిన హమీద్ కొరియర్ వచ్చిందని చెప్పాడు. అయితే ఆమె డోర్ తీయకుండా తన కుమారుడు వచ్చాకే అతనికే ఇవ్వాలని చెప్పింది. అదే రోజు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి కొరియర్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా ఆమె నిరాకరించింది. సాయంత్రం అతను వెళ్లిపోయాడని భావించిన వృద్ధురాలు తలుపులు తెరిచి చూడగా పక్కనే దాగి ఉన్న సయ్యద్ ఇంట్లోకి దూరి ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 29న అతడిని అదుపులోకి తీసుకుని, సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు రివార్డులు.... సయ్యద్ హెల్మెట్ ధరించి ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేసినా పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు మొహమ్మద్ మిన్హజుద్దీన్ ఖాన్, వల్లపు క్రిష్ణ, అరవింద్‌కుమార్‌లకు రివార్డులు అందించి అభినందించారు. (చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినా.. ) -
APSRTC: కార్గో కొత్త పుంతలు.. 48 గంటల్లోపే సరకు డెలివరీ
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్‌కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్‌కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్‌గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్‌లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆదాయం అదుర్స్ ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్‌లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్లో విహారం) -
Sonu Sood: కొరియర్లో ఆక్సిజన్ సిలిండర్లు
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటూనే ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ వివిధ రకాలుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్న ఆయన తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులకు భారతదేశ వ్యాప్తంగా సిలిండర్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులు దేశంలోని ఎక్కడి నుంచి అడిగినా సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరం ఉన్న వారు www.umeedysonusood.com కు లాగిన్ అయితే డీటీడీసీ ద్వారా కొరియర్లు పంపనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేయాలని సోనూ సూద్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. చదవండి : యాంటీ కోవిడ్ డ్రగ్స్ సెలబ్రిటీల వద్ద ఎలా ఉన్నాయి : హైకోర్టు Sonu Sood: నేనూ సోనూసూద్ అవుతా -
హైదరాబాద్ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు సేవలను అందిస్తున్న ప్రముఖ ట్రాన్స్‌పోర్టు సంస్థ గరుడవేగ.. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కూడా కొత్త బ్రాంచీలను ప్రారంభించనుంది. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా ఉన్న పార్శిళ్లకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న బంధువులకు చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గరుడ వేగ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, విదేశాల్లో తమవారికి దూరంగా ఉన్నప్పటికీ కానుకలు పంపించి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందన్న గరుడవేగ.. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సదుపాయాలను ఆఫర్ల రూపంలో అందించనుంది. ఈ సందర్భంగా వినియోగదారులకు కొత్త సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. -
ఇక డోర్ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ విజయవాడ రీజియన్ త్వరలో కొరియర్ డోర్ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్ పార్సిళ్లకే డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిని వస్త్ర, కూరగాయల వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్స్), మెడ్‌ప్లస్, అపోలో (మందులు), బ్రిడ్జిస్టోన్ (టైర్లు) వంటి సంస్థలు సరుకులతో పాటు విద్యాశాఖ పుస్తకాల రవాణాకు కూడా ఆర్టీసీనే ఎంచుకున్నాయి. ఈ పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు/సంస్థలకు పంపడానికి రీజియన్‌లో ప్రత్యేకంగా ఒక వ్యాను, రెండు ఆటోలను కేటాయించారు. సరుకు ఎక్కువగా వస్తే డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు (డీజీటీ) వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. వీటికి నగర పరిధిలో బట్వాడా చేయడానికి 50 కిలోల వరకు రూ.20, ఒక క్వింటాల్‌కు అయితే రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ బాగుండడంతో విజయవాడ, మచిలీ పట్నం, గుడివాడల్లో జూలై నుంచి కోరిన వారందరికీ డోర్ డెలివరీని అందుబాటులోకి తెచ్చారు. పార్సిల్ వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత వినియోగదారుడికి ఫోన్లో తెలియజేస్తున్నారు. వారు తమకు డోర్ డెలివరీ చేయమని కోరితే నిర్ణీత చార్జి వసూలు చేసి చేరవేస్తున్నారు. సేవలు బాగుండటం, ఇతర సంస్థలకంటే తక్కువ చార్జి, తక్కువ సమయంలోనే బట్వాడా చేస్తుండడం వంటి కారణాలతో ఆర్టీసీలో సరుకు రవాణాకు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కొరియర్ డోర్ డెలివరీ సేవల్లోకి.. పార్సిల్ రంగంలో ఆశించిన ఫలితాలు వస్తుండడంతో ఆర్టీసీ విజయవాడ రీజియన్ అధికారులు కొత్తగా కొరియర్ డోర్ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. ఇతర సంస్థల మాదిరిగానే కొరియర్ కవర్లను బుక్ చేస్తారు. డోర్ డెలివరీ చేస్తారు. ఆర్టీసీ సరీ్వసులు పట్టణాలు, నగరాలతో పాటు మారుమూల పల్లెలకు వెళ్తున్నందున కొరియర్ సర్వీసుకు కూడా ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు కొరియర్ డోర్ డెలివరీ సేవలు అందుబాటులో లేవు. గత ఏడాది పార్సిల్ రవాణా ద్వారా ఈ రీజియన్ రూ.12 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది రూ.15 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక పరిజ్ఞానంతో ముందుకు.. సరుకు రవాణాలో ఆర్టీసీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల సత్వరమే సరుకును డెలివరీ చేయగలుగుతోంది. సమయం బాగా కలిసి వస్తోంది. వివిధ చోట్ల నుంచి వచ్చిన పార్సిళ్లను రీజనల్ ఆఫీస్‌లోని పార్సిల్ విభాగానికి చేరుస్తారు. అక్కడ వాటికి నంబరు కేటాయించి నిర్దేశిత ర్యాకుల్లో ఉంచుతారు. వాటిని ఫొటోలు తీసి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. వినియోగదారుడు తమ పార్సిల్ తీసుకెళ్లడానికి రాగానే స్కాన్ ద్వారా ఆ పార్సిల్ ఎక్కడుందో తెలిసిపోతుంది. దానిని కొద్ది నిమిషాల వ్యవధిలోనే అందజేస్తున్నారు. సరుకు ట్రాకింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు బుక్ చేసిన సరుకు/పార్సిల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది. డోర్ డెలివరీకి ఆదరణ ఉంటుంది ఆర్టీసీ పార్సిల్ సేవలు ఇప్పటికే వినియోగదారుల ఆదరణ పొందాయి. కోరుకున్న వారికి పార్సిళ్లను నిర్ణీత రుసుంకే డోర్ డెలివరీ చేస్తున్నాం. రీజియన్‌లో కొత్తగా కొరియర్ డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు సైతం కొరియర్ వస్తువులు/కవర్లను డెలివరీ చేసేందుకు మాకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రజల ఆదరణ పొందుతుంది. – నాగేంద్రప్రసాద్, ఆర్ఎం, ఆర్టీసీ విజయవాడ రీజియన్ -
కర్నూలు నేషనల్ హైవేపై దారిదోపిడీ
సాక్షి, కర్నూలు: కంటైనర్ హైవేలపైకి చేరగానే వాళ్లూ హైవేపైకి దూసుకొస్తారు. రన్నింగ్ వెహికల్స్ లోనే తమ పని పూర్తి చేసుకొని జారుకుంటారు. ఉదయాన్నే వస్తువుల్ని డెలివరీ చేసేందుకు ఆ కంటైనర్ ఓపన్ చేసి చూస్తేగానీ చోరీ జరిగిన విషయం బయటపడదు. ఈ తరహా చోరీలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. కర్నూల్ నేషనల్ హైవేపై ఏ స్థాయిలో దారిదోపిడీలు జరుగుతాయో ఓ వాహనానికి అమర్చిన సీసీటీవీ సాక్షిగా బయటపడింది. యాక్షన్ మూవీలను తలదన్నే రియల్ యాక్టివిటీ ఇది. వాహనం రన్నింగ్‌లోనే ఉంది. ఓ గ్యాంగ్ బైక్‌పై వచ్చి కంటైనర్ వాహనాన్ని అందుకున్నాడు. ఓ తన గ్యాంగ్ కిందపడిపోవడంతో చోరీకి బ్రేక్ పడింది. దీంతో హైస్పీడ్‌లోనూ చిన్న టెక్నిక్‌తో కిందికి దిగేశాడు ఈ దొంగ. కర్నూల్ హైవేపై నిత్యం ఇలాంటి భారీ కంటైనర్స్ రకరకాల వస్తువులతో వెళ్తుంటాయి. ఇళ్లను టార్గెట్ చేస్తే పెద్దగా వర్కవుట్ అవ్వదని భావిస్తున్న దొంగలు.. హైవేలపై వెళ్లే వస్తువుల కంటైనర్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీలు కొరియర్ సర్వీసులకు పెద్ద ముప్పుగా మారాయి. డీటీడీసీ కొరియర్, వరల్డ్ ఫస్ట్ ఫ్లైట్ వంటి బ్రాండెడ్ కొరియర్ సర్వీసులకు దొంగల భయం నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కొరియర్ సర్వీసుల్లో ఖరీదైన వస్తువులు వెళ్తుంటాయి. వాటిని ఇలాంటి గ్యాంగులు కొట్టేస్తున్నాయి. ఇటీవలే రెండు కంటైనర్లలో 50 లక్షల విలువ చేసే వస్తువుల్ని ఎత్తుకెళ్లిపోయారు. ఏ కంటైనర్ ఎక్కడికి వెళ్లుతుంది, ఏ వాహనలో ఎలక్ట్రానిక్ గూడ్స్ వెళ్తుంటాయో పక్కాగా రెక్కీ నిర్వహిస్తారు. ఒక అద్దె కంటైనర్‌ను తమ వెంట హైవై మీదకు తీసుకెళ్లి రిహార్సల్స్ చేస్తారు. వేగంగా వెళ్తున్నప్పుడు ఎలా కంటైనర్ తెరవాలి.. వస్తువుల్ని ఎలా కొట్టేసి జాగ్రత్తగా కిందికి దించాలి.. మళ్లీ ఎలా తప్పించుకోవాలని ప్రాక్టీస్ చేస్తారు. ఇదంతా రాత్రి వేళల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే కడప నుండి హైదరాబాద్ వెళ్తున్న డీటీడీసీ కొరియర్ వాహనాన్ని మైదుకూరు వద్ద టీ త్రాగడానికి కాసేపు ఆపిన డ్రైవర్.. ఒంటి గంట సమయంలో కొరియర్ ఆఫీసుకు చేరుకొని డోర్ తీశాడు. అంతే.. వస్తువులు చోరీ అయ్యాయి. వరల్డ్ ఫస్ట్ ఫ్లైట్ కొరియర్ సర్వీస్ కంటైనర్‌కు కూడా ఇదే పరిస్థితి.. నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్న తమ్మరాజు పల్లె వద్ద కంటైనర్‌పై అటాక్‌కు ప్రయత్నించారు. అయితే ప్రమాదం జరగడంతో ఈ చోరీకి బ్రేక్ పడింది. ఈ తతంగమంతా ఆ కంటైనర్‌కు అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు దాదాపు అన్ని కంటైనర్లకూ సీసీటీవీలు అమర్చి.. ఒక మనిషి అదేపనిగా పర్యవేక్షిస్తున్నారు. అయినా సరే కొందరు కేటుగాళ్లు ఆ సీసీ కెమెరాలను పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. దీంతో హైవే దొంగల్ని పట్టుకోవడం.. వస్తువుల్ని తీసుకెళ్లే వాహనాలకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. -
రూ.3 కోట్లకు ‘కొరియర్’ కుచ్చుటోపీ
శాఖల ఏర్పాటు పేరుతో మోసం హైదరాబాద్ : కొరియర్ సర్వీస్ పేరుతో సుమారు రూ.3కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిందో సంస్థ. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఫోరన్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసెస్ పేరుతో నిర్వాహకులు పలు జిల్లాల్లో కొరియర్ సర్వీస్ శాఖలను ఏర్పాటు కోసం ప్రచారం చేశారు. లాభాలొస్తాయని ఆశించిన బాధితులు జిల్లా, సబ్‌జోనల్ వారీగా శాఖల ఏర్పాటు చేసుకునేందుకు రూ.1.30 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నిర్వాహకులకు చెల్లించారు. తమ ప్రాంతాల్లో కార్యాలయాలు తెరచిన బాధితులు అందుకు తగిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా ప్రధాన కార్యాల యం నుంచి కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అనుమతి రాకపోవడంతో వారంతా ఫోన్లో వాకబు చేయడం ప్రారంభించారు. అయితే అటునుంచి స్పందన రాలేదు. దీంతో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం హైదరాబాద్‌లోని సాధన్ కళాశాల దరి పావని ప్లాజా ఆరో అంతస్తులో ఉన్న సంస్థ కార్యాలయానికి వచ్చారు. సంస్థ రీజినల్ సేల్స్ మేనేజర్ రిపు దమన్‌సింగ్, ఆపరేషన్స్ హెడ్ పుల్‌దీప్‌సింగ్‌లను నిలదీశారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తారని వారు చెప్పడంతో బాధితులు గురువారం ఉదయం నుంచి కార్యాలయం వద్దనే గడిపారు. మధ్యాహ్నం గడిచినా సంస్థ ప్రతినిధులెవరూ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకొన్న వారు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.