శాఖల ఏర్పాటు పేరుతో మోసం
హైదరాబాద్ : కొరియర్ సర్వీస్ పేరుతో సుమారు రూ.3కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిందో సంస్థ. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఫోరన్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసెస్ పేరుతో నిర్వాహకులు పలు జిల్లాల్లో కొరియర్ సర్వీస్ శాఖలను ఏర్పాటు కోసం ప్రచారం చేశారు. లాభాలొస్తాయని ఆశించిన బాధితులు జిల్లా, సబ్‌జోనల్ వారీగా శాఖల ఏర్పాటు చేసుకునేందుకు రూ.1.30 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నిర్వాహకులకు చెల్లించారు. తమ ప్రాంతాల్లో కార్యాలయాలు తెరచిన బాధితులు అందుకు తగిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా ప్రధాన కార్యాల యం నుంచి కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అనుమతి రాకపోవడంతో వారంతా ఫోన్‌లో వాకబు చేయడం ప్రారంభించారు.
అయితే అటునుంచి స్పందన రాలేదు. దీంతో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం హైదరాబాద్‌లోని సాధన్ కళాశాల దరి పావని ప్లాజా ఆరో అంతస్తులో ఉన్న సంస్థ కార్యాలయానికి వచ్చారు. సంస్థ రీజినల్ సేల్స్ మేనేజర్ రిపు దమన్‌సింగ్, ఆపరేషన్స్ హెడ్ పుల్‌దీప్‌సింగ్‌లను నిలదీశారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తారని వారు చెప్పడంతో బాధితులు గురువారం ఉదయం నుంచి కార్యాలయం వద్దనే గడిపారు. మధ్యాహ్నం గడిచినా సంస్థ ప్రతినిధులెవరూ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకొన్న వారు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రూ.3 కోట్లకు ‘కొరియర్’ కుచ్చుటోపీ
Published Fri, Jun 13 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement
Advertisement