సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది.
తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్‌కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్‌లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్‌కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్‌లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు.
ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా
అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్‌గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్‌లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు.
ఆదాయం అదుర్స్
ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్‌లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్‌లో విహారం)
Comments
Please login to add a commentAdd a comment