ఇక ఇంటికే ఆర్టీసీ పార్సిళ్లు! | APSRTC is further expanding the scope of their services Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇక ఇంటికే ఆర్టీసీ పార్సిళ్లు!

Published Thu, Aug 26 2021 4:19 AM | Last Updated on Thu, Aug 26 2021 4:19 AM

APSRTC is further expanding the scope of their services Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీ తమ సేవల పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. లాజిస్టిక్స్‌ సేవల ద్వారా ఆదాయ పెంపుదలపై దృష్టి సారించింది. అందులో భాగంగా కార్గో రవాణాను డోర్‌ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్‌ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్‌ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. రోజుకు రూ.50 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్‌ 1 నుంచి కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. 

వ్యవస్థాగత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ...
2017 నుంచి ఆర్టీసీ అందిస్తోన్న కార్గో రవాణా సేవల విధానం ప్రకారం ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు వచ్చి పార్సిల్‌ బుక్‌ చేసుకుంటే గమ్య స్థానానికి చేరుస్తుంది. అక్కడ సంబంధిత వ్యక్తులు వచ్చి ఆ పార్సిళ్లను తీసుకువెళ్లాలి. కాగా కార్గో రవాణా పార్సిళ్లను గమ్యస్థానంలో డోర్‌ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెడితే మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకోవచ్చని ఆర్టీసీ భావించింది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా బస్‌ స్టేషన్లు, డిపోలు, ఇతర వ్యవస్థాగత సామర్థ్యం ఉంది. ప్రస్తుతం కార్గో రవాణా కోసం ఆర్టీసీ 10 టన్నుల బరువు సామర్థ్యం ఉన్న కంటైనర్‌లను ఉపయోగిస్తోంది. ఈ వ్యవస్థాగత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలు అందించాలని నిర్ణయించింది. ప్రైవేటు సంస్థల కంటే ఆర్టీసీ తక్కువ చార్జీలతో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. అందుకే కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలపై మార్కెట్‌ పరిస్థితులను అధ్యయనం చేసి ఓ ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. 

ప్రైవేటు సంస్థల కంటే మెరుగ్గా...
కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆర్టీసీ బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోంది. ఇక పార్సిళ్లకు ట్రాకింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్‌ చేసిన పార్సిల్‌ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్సిల్‌ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు కూడా ఏజంట్ల ద్వారా డోర్‌ డెలివరీ సేవలు అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. 

రోజుకు రూ.50 లక్షల రాబడి లక్ష్యం
లాజిస్టిక్‌ సేవల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. కార్గో రవాణా ద్వారా ఆర్టీసీకి 2019–20లో రూ.97.44 కోట్ల రాబడి వచ్చింది. లాక్‌డౌన్, ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ 2020–21లో లాజిస్టిక్‌ సేవల ద్వారా రూ.87.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిలో పార్సిల్‌ సర్వీసుల ద్వారా రూ.46.42 కోట్లు, కొరియర్‌ సేవల ద్వారా రూ.1.78 కోట్లు, బల్క్‌ బుకింగ్‌ల ద్వారా రూ.0.53 కోట్లు, కాంట్రాక్టు వాహనాల ద్వారా రూ.17.31 కోట్లు, ఏజెన్సీ సేవల ద్వారా రూ.21.20 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం రోజుకు సగటున 18 వేల పార్సిల్‌ బుకింగుల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.32 లక్షల రాబడి వస్తోంది. కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలు ప్రవేశపెట్టడం ద్వారా పార్సిల్‌ బుకింగులను రోజుకు 32 వేలకు పెంచుకోవాలని...తద్వారా రోజుకు రూ.50 లక్షల రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement