హైదరాబాద్: దుస్తుల మధ్య మాదక ద్రవ్యాలు పెట్టి కొరియర్ సర్వీస్‌లు, ప్రైవేట్ బస్సులలో సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ దీపారాం బిష్ణోయ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.60 లక్షలు విలువ చేసే 70 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏ, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడి ఖాతాలోని రూ.3.21 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. వివరాలను బుధవారం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
► రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో ఉంటూ ఎస్‌ఎస్ రెయిలింగ్ గ్రానైట్ వ్యాపారం ప్రారంభించాడు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన ఇతగాడు క్రమంగా పెడ్లర్‌గా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన డ్రగ్ సప్లయర్ రమేష్ కుమార్‌తో బిష్ణోయ్‌కి పరిచయం ఏర్పడింది. ఇతని నుంచి గ్రాము హెరాయిన్‌ను రూ.5–6 వేలకు కొనుగోలు చేసి, అక్రమ మార్గంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి రూ.8–10 వేలకు విక్రయించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు.
► పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకుంటూ.. ప్రైవేట్ బైక్ షేరింగ్ కంపెనీల ద్వారా డ్రగ్స్‌ను కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. బుధవారం విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ), చైతన్యపురి పోలీసులు టెలిఫోన్ కాలనీ సమీపంలో నిందితుడు బిష్ణోయ్‌ను పట్టుకున్నారు. అతని నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. నిందితుడు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు. పలువురు ప్రైవేట్ షేరింగ్ కంపెనీల ప్రతినిధులను కూడా నిందితులుగా చేర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment