
రోడ్డున ప్రమాదం చూస్తే సాయానికి పరిగెత్తి వెళ్లే మనిషిని, చుట్టూ చెడు జరిగితే మనకెందుకులే అనుకోని మనిషిని, ఇరుగింట్లో ఆర్తనాదాలకు చలించే మనిషిని, పొరుగింట్లో కష్టానికి హాజరయ్యే మనిషిని, ద్వేషమే జీవితంగా బతకని మనిషిని, ఒకరు బాగుపడితే సంతోషపడే మనిషిని, అడుగంటిపోయిన మానవత్వాన్ని జాగృతం చేసుకునే మనిషిని, మనిషి మీద నమ్మకం నిలిపే మనిషిని, ఓ కొత్త సంవత్సరమా మేల్కొలుపు.
వద్దు. నమ్మాల్సిన చోట నేరం చేసే మనిషి వద్దు.
భర్తగా ఉంటూ, భార్యగా ఉంటూ, స్నేహితుడిగా ఉంటూ, అత్త మామగా ఉంటూ, బంధువుగా ఉంటూ... వీరిని నమ్మొచ్చు, వీరిని కాకపోతే ఎవరిని నమ్ముతాం... అనుకున్న సందర్భంలో కూడా నేరం చేసి, ప్రాణం తీసి మనిషి మీద నమ్మకమే పోగొట్టిన– 2023లో చాలాసార్లు కనపడిన మనుషి– కొత్త సంవత్సరంలో వద్దు.
‘అయ్యో... నా గోడు ఎవరూ వినట్లేదే’ అని కన్నపిల్లలతో పాటు నిస్సహాయంగా వెళ్లి చెరువులో దూకే కన్నతల్లి వద్దు. ‘నా బాధ అమ్మానాన్నలు వినట్లేదే’నని హాస్టల్ ఫ్యాన్లకు వేళ్లాడే ముక్కుపచ్చలారని పిల్లలూ వద్దు. నలుగురు సంతానం ఉన్నా, మీ దగ్గర ఉంచుకుని నాలుగు మెతుకులు పెట్టండి చాలు అంటున్నా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను పడేసి వారిని బాధించే స్వార్థసంతానం వద్దు. సాకులు చెప్పే సంతానం వద్దు. ముఖ్యంగా– తల్లిదండ్రుల శాపం అందుకునే సంతానం వద్దు.
జీవితమంటే అనుక్షణం డబ్బు సంపాదనే అనుకునే, ఎంత ఉన్నా సరిపోదనుకునే మనిషి వద్దు. అందుకు ఉద్యోగ బాధ్యతలను కలుషితం చేసే, ప్రజల భవిష్యత్తును బలి పెట్టే మనిషి వద్దు. కల్తీ చేసే మనిషి, విషం లాంటి ఆహారం అమ్మే, కూరనారలను రసాయనం చేసే మనిషి వద్దు. వ్యసనపరులుగా మార్చే ఉత్పత్తులను తయారు చేసే మనిషి వద్దు. అందుకు అనుమతించే ప్రభుత్వ నేతలూ వద్దు.
వైద్యం తెలియని వైద్యుడు వద్దు. దైవభీతి పాపభీతి లేని వైద్యుడు వద్దు. రోగి మీద దయ, సానుభూతి లేని వైద్యుడు వద్దు. రోగుల అశ్రువులను అంతస్తులుగా చేసి ఆస్పత్రులు నిర్మించాలనుకునే వైద్యుడు వద్దు. చదువుల పేరుతో తల్లిదండ్రుల కడుపులో గంజిని కూడా తాగే విద్యావ్యవస్థల యజమాని కూడా వద్దు.
మూర్ఖుడు వద్దు. మూకస్వభావము ఉన్నవాడూ వద్దు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి సాటి మనిషిని ద్వేషించే వాడు వద్దు. బతకగోరని వాడు వద్దు. బతకనివ్వనివాడు వద్దు. అమాయకుల నుంచి లాక్కుని నింగినీ, నేలనూ మింగేసేవాడు వద్దు. ఉద్యోగుల గోడు వినని యజమాని వద్దు. పిలిస్తే పలకని పోలీసు వాడు వద్దు. న్యాయం వైపు నిలవని తీర్పు కూడా వద్దు.
2024 సంవత్సరమా... ఎన్నో ఆశలను కల్పిస్తూ అడుగిడుతున్న నూతన వత్సరమా... ఎంత జరిగినా ఏమి జరిగినా ‘మానవుడే మహనీయుడు’ అని నిరూపించే నిదర్శనాలను ఈ సంవత్సరం చూపు. మనిషిని మేల్కొలుపు. మనిషి తప్ప మరెవరూ ఈ జగతిని శాంతితో, కాంతితో నింపలేరు. కుడికాలు ముందు పెట్టి రా తల్లీ!
Comments
Please login to add a commentAdd a comment