
సాక్షి, జేంద్రనగర్ (హైదరాబాద్): రోడ్డు పక్కన అచేతనంగా ఒంటిపై దుస్తులు లేకుండా పడి ఉన్న ఓ మహిళ (45)ను రాజేంద్రనగర్ పోలీసులు ఆదుకున్నారు. దుస్తులు వేసి తినేందుకు ఆహారాన్ని అందించారు. అన్నం కలిపి తినేందుకు సైతం శక్తి లేకపోవడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మహిళ పడి ఉందని 100 నంబర్‌కు సమాచారం అందింది. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. (చదవండి: ప్రధాన మంత్రి ప్రశంసలు అందుకున్న హిమేష్ )
ఓ మహిళ ఒంటిపై దుస్తులు లేకుండా అచేతనంగా పడి ఉండడంతో ఇద్దరు మహిళా పోలీసులను రప్పించి ఆమెకు దుస్తులు వేశారు. మంచినీరు అందించారు. తినేందుకు ఏమైనా ఇవ్వాలని ఆమె సైగలు చేయడంతో పోలీసులు అన్నం తీసుకొచ్చి అందించారు. అన్నం కలిపి నోట్లో పెట్టుకునేందుకు కూడా ఆ మహిళ ఇబ్బంది పడుతుండడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు తినిపించి ఠాణాకు తీసుకొచ్చారు. తన పేరు రాజమణి.. కుమారుడి పేరు మహేశ్ అని మహిళ తెలిపింది. మహిళను హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. మహిళ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment