CM YS Jagan Once Again Expressed His Humanity - Sakshi
Sakshi News home page

మరోసారి గొప్ప మనసు​ చాటుకున్న సీఎం జగన్‌.. కలెక్టర్‌కు ఆదేశాలు

Published Thu, Apr 6 2023 7:50 PM | Last Updated on Thu, Apr 6 2023 8:43 PM

Cm Ys Jagan Once Again Expressed His Humanity - Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్లలో  సీఎం జగన్‌ గురువారం పర్యటించారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దృష్టికి ఐదుగురు బాధితులు తమ అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, ఆర్ధిక సహకారం, ఉపాధి అవకాశాలను కల్పించాలని వేడుకున్నారు.

దీనిపై స్పందించిన సీఎం.. వారిని తక్షణం ఆదుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ని ఆదేశించారు.  సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బాధితులను జిల్లా కలెక్టరేట్‌కు పిలిపించి మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశారు.

తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య

జిల్లా కలెక్టర్‌ను కలిసిన బాధితుల్లో చిలకలూరిపేట నియోజకవర్గం, కనపర్రు గ్రామానికి చెందిన తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య తన మనవరాలు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో అన్నం తినే సమయంలో అన్నవాహికకు అడ్డం పడుతుందని వాపోయారు. తమకు ఎటువంటి స్థిర,చర ఆస్తులు లేవని, ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఏడాదికి సుమారు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని అందించమని వేడుకొనగా తక్షణ సాయం కింద బాధితులకు 1 లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని జిల్లా కలెక్టర్  అందించారు.

చిలకలూరిపేట నియోజకవర్గం, ఏలూరుకు చెందిన పటాన్ మహబూబ్ సుభాని తనకు చిన్నప్పటి నుంచి సోరియాసిస్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. తనకున్నసమస్యను పరిష్కరించడంతో పాటు కుటుంబ జీవన విధానం బాగుపడేందుకు తగిన ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్ధిక సాయం కింద బాధితునికి జిల్లా కలెక్టర్ 1 లక్ష సాయం అందజేశారు.


పటాన్ మహబూబ్ సుభాని


అనురాధ, వెంకటేష్ దంపతుల ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి)

చిలకలూరిపేట పట్టణం 18వ వార్డుకు చెందిన అనురాధ, వెంకటేష్ దంపతులు తన ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి) పుట్టినప్పటి నుండి కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతుందని సీఎం ముందు వాపోయారు. పాపకు పలు ఆస్పత్రులలో చికిత్సలు అందించినప్పటికీ, హైదరాబాద్‌లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పటల్ నందు సమస్య నయమవుతుందని చెప్పడంతో అక్కడికి వెళ్లి పాపకు వైద్యం చేయించామని, కాలేయ మార్పిడి ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఇందుకోసం లక్షల్లో చికిత్సకు ఖర్చవుతుందని తెలియజేయడంతో బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆశ్రయించి వేడుకోవడంతో వారికి సీఎం వైద్య చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బాధితులకు తక్షణ వైద్య సాయం కింద ఖర్చుల నిమిత్తం 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు.

నరసరావుపేటకు చెందిన సమీన్ పర్వానా అనే మహిళ తన ఏడేళ్ల సుభాని అనే  బాలునికి జ్వరం రావడం తో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తీసుకు వెళ్ళానని, ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం వలన  తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడని అక్కడినుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి అనేక ప్రముఖ వైద్య శాలలకు తీసుకు వెళ్ళినా నయం కాకపోగా ఐ.సీ,యూ లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని ఆదుకోవాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని వేడుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ముఖ్య మంత్రి స్పందించిన మేరకు 1 లక్ష రూపాయలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.  

 
సమీన్ పర్వానా 


కుంభగిరి పేరెడ్డి

కుంభగిరి పేరెడ్డి డిసెంబరు 30వ తేదిన ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడిపోయానని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. ఎంత వైద్య చికిత్స చేయించుకున్నా తలకు, పొట్టకు తీవ్ర గాయం అయ్యి కోలుకోలేక పోతున్నానని ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన సీఎం జగన్‌ మెరుగైన వైద్యసేవలను అందిస్తామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ బాధితునికి 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు.
చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement