సాక్షి, ఎన్టీఆర్: సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు.. ఈ నినాదం మాటేమోగానీ దానిని చేతల్లో చూపిస్తున్న నేత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ‘‘మీరే నా కుటుంబం, మీకు అండగా నేను ఉన్నాను. మీ జీవితాలకు నాదీ భరోసా. మీ బాధలను నేను చెరిపేస్తా’’ అంటూ సహాయం కోసం అర్థించిన కుటుంబాల్లో స్వయంగా వెలుగులు నింపుతున్నారాయన. సహయం కోసం వచ్చేవాళ్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చే బాపతి కాదు ఆయన. సావధానంగా వాళ్ల సమస్యలను విని.. అప్పటికప్పుడే అధికారులతో ఆ సమస్య గురించి చర్చించి.. గంటల వ్యవధిలోనే సహయం అందేలా చూస్తున్నారు కూడా.
తాజాగా.. అలా సాయం అందుకున్న వాలంటీర్ జక్కుల సోంబాబు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడతను. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సోంబాబుకి.. పెద్ద ఆపదే వచ్చిపడింది. అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయినా ఆ సమస్యను లెక్కచేయకుండా వాలంటీర్‌గా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడతను. అందుకే సీఎం జగన్‌పై ఉన్న అభిమానం కూడా ఓ కారణమని చెబుతున్నాడతను.
కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అతనిది. తల్లి సాధారణ కూలీ కావడంతో ఆర్థికంగా ఇబ్బందిగా మారుతూ వస్తోంది. అయినా కూడా వాలంటీర్ బాధ్యతలను ఏమాత్రం విస్మరించలేదతను. ఈలోపు అతని సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది.
శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన సీఎం జగన్‌ను.. సోంబాబు, అతని తల్లి కలిశారు. అతని సమస్య తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయం అక్కడితోనే ఆగలేదు.. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక కిడ్నీ మార్పిడికి అవసరమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. ఆ సర్జరీకి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు సీఎం జగన్.
ఆ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని చెబుతూ సోంబాబు సంతోషంగా సీఎం జగన్‌కు పాదాభివందనం చేయబోగా.. ఆయన వద్దని వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు.
రెండు లక్షల చెక్కు అందజేత
ఒక వాలంటీర్‌కు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి చూపించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. గంట లోపే సోంబాబు కుటుంబాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల చెక్ అందించారు. అలాగే సోంబాబుకు సీఎం జగన్ ప్రకటించిన ఇతర సహాయాలనూ కలెక్టర్ కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారాయన.
ఇదీ చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment