Kidney patient
-
థాంక్యూ జగనన్న.. వాలంటీర్ సోంబాబు కృతజ్ఞతలు
సాక్షి, ఎన్టీఆర్: సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు.. ఈ నినాదం మాటేమోగానీ దానిని చేతల్లో చూపిస్తున్న నేత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ‘‘మీరే నా కుటుంబం, మీకు అండగా నేను ఉన్నాను. మీ జీవితాలకు నాదీ భరోసా. మీ బాధలను నేను చెరిపేస్తా’’ అంటూ సహాయం కోసం అర్థించిన కుటుంబాల్లో స్వయంగా వెలుగులు నింపుతున్నారాయన. సహయం కోసం వచ్చేవాళ్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చే బాపతి కాదు ఆయన. సావధానంగా వాళ్ల సమస్యలను విని.. అప్పటికప్పుడే అధికారులతో ఆ సమస్య గురించి చర్చించి.. గంటల వ్యవధిలోనే సహయం అందేలా చూస్తున్నారు కూడా. తాజాగా.. అలా సాయం అందుకున్న వాలంటీర్ జక్కుల సోంబాబు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడతను. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సోంబాబుకి.. పెద్ద ఆపదే వచ్చిపడింది. అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయినా ఆ సమస్యను లెక్కచేయకుండా వాలంటీర్‌గా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడతను. అందుకే సీఎం జగన్‌పై ఉన్న అభిమానం కూడా ఓ కారణమని చెబుతున్నాడతను. కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అతనిది. తల్లి సాధారణ కూలీ కావడంతో ఆర్థికంగా ఇబ్బందిగా మారుతూ వస్తోంది. అయినా కూడా వాలంటీర్ బాధ్యతలను ఏమాత్రం విస్మరించలేదతను. ఈలోపు అతని సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది. శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన సీఎం జగన్‌ను.. సోంబాబు, అతని తల్లి కలిశారు. అతని సమస్య తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయం అక్కడితోనే ఆగలేదు.. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక కిడ్నీ మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. ఆ సర్జరీకి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు సీఎం జగన్. ఆ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని చెబుతూ సోంబాబు సంతోషంగా సీఎం జగన్‌కు పాదాభివందనం చేయబోగా.. ఆయన వద్దని వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు. రెండు లక్షల చెక్కు అందజేత ఒక వాలంటీర్‌కు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి చూపించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. గంట లోపే సోంబాబు కుటుంబాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల చెక్ అందించారు. అలాగే సోంబాబుకు సీఎం జగన్ ప్రకటించిన ఇతర సహాయాలనూ కలెక్టర్ కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారాయన. ఇదీ చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా? -
కిడ్నీ రోగికి సీఎం వైఎస్ జగన్ సాయం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెడన పట్టణం 7వ వార్డుకు చెందిన వాసా కుమార స్వామి, మధులత దంపతుల కుమారుడు రేవంత్ కుమార్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నాడు. పట్టణ వైసీపీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యుడు జోగి రమేష్.. ముఖ్యమంత్రి కార్యాలయ వైద్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం యశోద ఆసుపత్రికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఎమ్మెల్యే జోగి రమేష్ శుక్రవారం ఆ బాలుడి కుటుంబానికి అందజేశారు. వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఈ నెల 18న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం -
అన్న కోసం పోరాటం, మంత్రి కేటీఆర్ అభయం
సాక్షి, రాజన్నసిరిసిల్ల: అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అలాంటి రక్షా బంధన్ రోజున ఓ చెల్లెలు తన సోదరుడి ప్రాణాలు కాపాడండి అంటూ . మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వేములవాడ మండలం వావిలాలకు చెందిన కిడ్నీ పేషెంట్ పోచయ్య జ్వరంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది పోచయ్యను పటించుకోకపోవడంతో అతని సోదరి విలవిల్లాడారు. (చదవండి: సిఫారసు ఉంటేనే.. కరోనా పరీక్షలు!) రాఖీ పండుగ రోజు సిరిసిల్ల ఆసుపత్రికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసిన ఆమె తన అన్న ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డాక్టర్లు బిజీగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న వైద్యం కోసం చెల్లెలు పోరాటానికి దిగిన ఘటనను స్థానికులు చూసి చలించిపోయారు. అయితే, మంత్రి కేటీఆర్ ఆసుపత్రి నుంచి తిరుగుప్రయాణం అవుతున్న సమయంలో బాధిత మహిళను పలకరించి, కిడ్నీ పేషంట్ పోచయ్యకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్‌ను ఆదేశించారు. కేటీఆర్ అన్నయ్య అభయంతో ఆ చెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. (రాఖీ విషాదం, అన్నాచెల్లెలు మృతి) -
సీఎం జగన్ స్ఫూర్తితో నేనున్నానని...
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక కారణాలతో ఏ ఒక్కరు కూడా సరైన వైద్యం అందక మృతి చెందకూడదు. ప్రతిపేదవాడికీ నాణ్యమైన వైద్యం అందాలి.. అని నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఆ ఉదాత్త ఆశయంతోనే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. దాన్ని తన మానస పుత్రికగా భావించి పక్కాగా అమలు చేశారు. పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. నాడు నాన్న వేసిన బాటలోనే.. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారు. గత కొన్నేళ్లుగా అనాథగా మారిన ఆరోగ్యశ్రీని పొదివి పట్టుకొని.. మళ్లీ ఆర్తుల చెంతకు చేరుస్తున్నారు. ఇదే ఆశయ స్ఫూర్తిని విశాఖ నుంచే చాటిచెప్పారు. పదిరోజుల కిందట శారదాపీఠం సందర్శనకు వచ్చిన సందర్భంలో విమానాశ్రయంలో బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయంలో ఉన్న తోటి విద్యార్ధి నీరజ్ కోసం స్నేహితులు చేపట్టిన ఆందోళన చూసి చలించిన సీఎం జగన్ వెంటనే తన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వైద్యసాయానికి చర్యలు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ బాటలోనే.. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారు.. డిఫ్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). రెండు కిడ్నీలు పాడై ఆర్ధిక బాధలతో చికిత్స కోసం అల్లాడిపోతున్న ధనోజ్‌కు బాసటగా నిలిచారు. ధనోజ్ దయనీయస్థితిపై నాలుగురోజుల కిందట సాక్షిలో వచ్చిన కథనంతో పాటు కుటుంబసభ్యులు పంపిన వాట్సాప్ మెసేజ్‌ను చూసి స్పందించిన ఆయన వారిని తనవద్దకు పిలిపించుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకంతో డబ్బుల కోసం నిన్నటి వరకు దాతల సాయం ఆశించిన ఆ కుటుంబానికి ఇప్పుడు ఏకంగా సర్కారు అండ దొరికింది. ఎంత ఖర్చయినా సరే మొత్తం బాధ్యత ప్రభుత్వానిదేనని డిఫ్యూటీ సీఎం నాని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం మైక్యూర్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆదరణ చూపిన డిఫ్యూటీ సీఎం నాని రుణం తీర్చలేనిదంటూ ధనోజ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు. విశాఖలో కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోపణల్లో చిక్కుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చూపుతూ, నిబంధనలకు నీళ్లొదులుతూ రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. విశాఖలో ఆర్కే ఓమ్నీలో జరిగిన వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కాంక్షకు దర్పణం పడుతోంది. రెండు కిడ్నీలు చెడిపోయిన ఓ పేద బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని రూ.70 వేలు వసూలు చేయడం, వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు చెల్లించాలని డిమాండ్ చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆటో నడుపుకుని బతుకీడుస్తున్న ఆ కుటుంబం అంత సొమ్ము చెల్లించుకోలేక వైద్యారోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో దిగివచ్చి ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వైద్యం అందిస్తోంది. ఇలా విశాఖలో పేద, మధ్య తరగతి రోగుల నుంచి రూ.లక్షల్లో కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి అరుదుగానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనకాపల్లి మండలం రేబాకకు చెందిన ఆటో డ్రైవర్ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్ (9)కు రెండు కిడ్నీలు పాడై పోయాయి. రెండు నెలల క్రితం ధనోజ్తో పాటు అతని సోదరుడు డెంగ్యూ జ్వరం బారినపడ్డారు. తొలుత వీరిని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చినా నయం కాకపోవడంతో ఇదే ఓమ్ని ఆర్కే ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అప్పట్లో ఇద్దరికీ రూ.1.50 లక్షలు బిల్లు చెల్లించారు. ఇటీవల ధనోజ్ ఫిట్స్‌తో పడిపోవడంతో తొలుత అనకాపల్లి ఆస్పత్రిలోనే చేర్చారు. అక్కడ వైద్యులు ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాబుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని, బతకాలంటే లక్షల్లో ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆటో నడుపుకుని బతికే తాము అంత ఖర్చును భరించలేమని ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలని కోరారు. ధనుష్ రోగం ఆరోగ్యశ్రీ కిందికి రాదని చెప్పి దశల వారీగా రూ.70 వేలు కట్టించుకున్నారు. వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఈ కుటుంబ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఈనెల 13న ‘సాక్షి’ ‘పేదింటి బిడ్డకు పెద్ద కష్టం’ శీర్షికతో కథనాన్ని ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తమ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న భావనతో కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ధనోజ్ పరిస్థితిని తెలియజేశారు. రూరల్ ఆస్పత్రులతో కార్పొరేట్‌కు లింకులు ఇక నగరంలోని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఆస్పత్రులతో లింకులున్నాయి. తమ వద్దకు వచ్చిన రోగులను నేరుగా విశాఖలోని ఫలానా ఆస్పత్రికి వెళ్లండంటూ పంపిస్తున్నారు. ఈ కేసుల నుంచి వచ్చే సొమ్ములో కొంత సొమ్మును పంపిన ఆస్పత్రులకు ఇస్తుంటారు. ఇదొక వ్యాపారంగా మారింది. ఉదాహరణకు ధనోజ్, అతని సోదరుడు రెండు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో అనకాపల్లిలోని లండన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నయం కాకపోవడంతో ఓమ్నీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇప్పుడు కిడ్నీ జబ్బుతో ఉన్న ధనోజ్‌ను ఓమ్నీకి మళ్లీ రిఫర్ చేసింది కూడా లండన్ ఆస్పత్రే. ఇలా జిల్లాలోను, నగరంలోనూ పలు ఆస్పత్రులకు ఎన్నో వ్యాపార లింకులున్నాయి. ఇదే ఇప్పుడు ఆయా హాస్పిటళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. మంత్రి నాని మానవత్వం తక్షణమే స్పందించిన మంత్రి వైద్య రికార్డులతో తన వద్దకు రమ్మని స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. అంతేకాదు..ఆరోగ్యశ్రీకి అర్హత ఉన్నా అందులో చేర్చకపోవడంపై ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము తిరిగివ్వాలని, ఆరోగ్యశ్రీలో ఉచితంగా ధనోజ్‌కు వైద్యం అందించాలని ఆదేశించారు. కార్పొరేట్/ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి చేరుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి సూచనలతో ధనోజ్‌కు మెరుగైన వైద్యం అందించడానికి మంగళవారం ఉదయం నగరంలోని మైక్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వైద్యం ఖర్చుపై ఆందోళన చెందవద్దని, ఆ సొమ్మును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. రూ. కోట్లలో బకాయిలు ఇన్నాళ్లూ ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కోట్లలో పేరుకుపోయిన బకాయిలను గత ప్రభుత్వం చెల్లించడం మానేసింది. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందజేస్తే బకాయిలు ఆలస్యంగా వస్తాయన్న ఉద్దేశంతో ఆయా ఆస్పత్రులు ఏవేవో వంకలు పెట్టి తిరస్కరిస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న రోగి కుటుంబ సభ్యులు అప్పులు చేసి, ఆస్తులమ్ముకుని నగదు చెల్లించి వైద్యం చేయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోవడానికి ఇదో కారణమని చెబుతున్నారు. -
ఆ దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది
రాజోళి (అలంపూర్) : ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి–భారతి దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది.. అపుడే నాకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్ పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని చూడా లని తన కోరిక అని ఆయన చెప్పిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శనివారం రాజోళికి వచ్చి విద్యాసాగర్‌ను ఆయన నివాసం లో పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ తనకు, తన తల్లిదండ్రులకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే ప్రాణమని.. ఎప్పటికైనా పెద్దాయనను కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ చూసినపుడల్లా కలవాలని, మాట్లాడాలని అనిపించినా కుదరడం లేదని తెలిపారు. సివిల్ ఇంజనీర్‌గా ఎన్నో ప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కకపోగా.. వైఎస్ కుటుంబాన్ని చూడగానే తెలియని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. అయితే, పని చేసే సమయంలోనే నా రెండు కిడ్నీలు చెడిపోగా, అల్సర్ కూడా వచ్చిందని.. ఇంతలోనే తన కూతురు కూడా చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కూడా జగన్‌ను చూడాలని కోరుకునేదని.. ఆమె కోరిక తీరకపోగా, తన కోరికైనా తీరుతుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను జగన్ చూడాలనుకుంటున్న విషయం తెలుసుకుని ఆయన తరఫున శ్రీకాం త్‌రెడ్డిని పంపించడం ఆనందంగా ఉందని విద్యాసాగర్ తెలిపారు. ఇంత త్వరగా స్పందించే గుణం ఉండడంతోనే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, అందుకే జననేతగా పిలుస్తున్నారని తెలిపారు. విద్యాసాగర్‌కు అండగా ఉంటాం.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటా మని గట్టు శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేలా సమస్య తెలుసుకునేందుకు తనను జగన్మోహన్రెడ్డి పంపించారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండూరు చంద్రశేఖర్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, బీస మరియమ్మతో పాటు భూపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, చంద్రవాసులు రెడ్డి, బంగారు మహేశ్వర్ రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రాజు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైద్యుడి అత్యాశ.. ఆపరేషన్ మధ్యలోనే..
పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వైద్యులు డబ్బుమీద అత్యాశతో వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. కిడ్నీ రోగికి ఆపరేషన్ చేస్తూ.. అదనంగా డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడో వైద్యుడు. ఈ సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన జుత్తిగ పార్థసారథి(55) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. నిన్న ఆపరేషన్ చేస్తూ ఉండగా మహేష్ అనే వైద్యుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని రోగి బంధువులు ఆరోపించారు. కిడ్నీలో రాళ్ళ వ్యాధితో గత రెండు రోజుల క్రితం పార్థసారథిని మదర్ వన్నినిలో అతని బంధువులు చేర్పించారు. అయితే ఇక్కడి సిబ్బంది స్కానింగ్, ఇతర పరీక్షల నిమిత్తం ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నిన్న మదర్ వన్నినికి తీసుకొచ్చారు. అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకు పార్థసారథికి కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరగాల్సి ఉండగా వైద్యుడు మహేష్ ఆలస్యంగా 7.30 గంటలకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాడు. మత్తు ఇచ్చి సగం ఆపరేషన్ అయ్యాక స్టోన్ కిడ్నీ కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని తనకు డబ్బులిస్తే ఇప్పుడే స్టోన్‌ను తొలగిస్తానని లేకుంటే అలానే వదిలేస్తానన్నాడని పేషేంట్ బంధువులు ఆరోపించారు. తాము సొమ్ములిచ్చుకోలేమనడంతో ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారంటూ వారు వాపోయారు. ఈ విషయం ముందే చెప్పాలి గానీ ఆపరేషన్ మధ్యలో చెప్పడమేంటని డాక్టర్‌ను వారు నిలదీశారు. కొద్దిసేపటి తర్వాత వైద్యుడు మహేష్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. దీంతో పేషేంట్ బంధువులు అక్కడి సిబ్బందిని నిలదీసి ఆందోళన నిర్వహించారు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బందికి, పేషేంట్ బంధువులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సొమ్ములకోసం ఆపరేషన్‌ను మధ్యలో వదిలివెళ్లిన డాక్టర్ మహేహ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని వారు కోరారు. -
జబ్బుకు అందని డబ్బు
నిబంధనల సాకుతో వైద్యానికి డబ్బు ఇవ్వని బ్యాంకు సిబ్బంది చికిత్సకు రూ.30 వేలు అవసరమన్నా రూ.10 వేలే ఇచ్చి పంపిన వైనం సాక్షి, మెదక్: పెద్ద నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారం ఓ కిడ్నీ రోగి ప్రాణం మీదకు తెచ్చింది! బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా వైద్యం పొందలేని దయనీ య పరిస్థితి. డయాలసిస్‌కు అవసరమైనన్ని డబ్బు లు డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరా కరించడంతో ఆమె చికిత్సకు దూరమైంది. వైద్యా నికి డబ్బులు కావాలని బతిమాలుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించకపోవడంతో కన్నీళ్లతో వెనుది రిగింది. మెదక్‌లోని ఫతేనగర్‌కు చెందిన ప్రమీలకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2015లో హైద రాబాద్లోని కిమ్స్ వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఏడాదిన్నరగా కిమ్స్‌లో చికిత్స పొందుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు. అయితే ప్రతినెలా ఓసారి డయాలసిస్ పైప్ మార్చుకోవటంతోపాటు డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయాలి. ఈ నెల 9న ప్రమీల డయాలసిస్ కోసం కిమ్స్‌కు వెళ్లాల్సి ఉంది. బ్యాంకుల బంద్ ఉండటంతో వెళ్లలేదు. గురువారం డబ్బులు డ్రా చేసుకుని కిమ్స్ వెళ్లాలనుకుంది. మెద క్ ఎస్బీహెచ్ బ్యాంకులోని తన ఖాతాలో రూ.35 వేల డబ్బులు ఉండటంతో రూ.30 వేలు డ్రా చేసు కుందామని భర్త ప్రేమ్‌కుమార్‌తో కలిసి స్థానిక రాంనగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంకుకు వెళ్లింది. అరుుతే బ్యాంకు సిబ్బంది కేవలం పది వేలు మాత్రమే డ్రా చేసుకునేందుకు అవకాశం ఉం దన్నారు. తన ఖాతాలో రూ.35 వేలు ఉన్నాయని, వైద్యం కోసం తనకు తక్షణం రూ.30 వేలు అవస రమని బ్యాంకు సిబ్బందిని వేడుకుంది. అయినా సిబ్బంది ససేమిరా అనటంతో అకౌంట్ నుంచి రూ.10 వేలు డ్రా చేసుకుంది. మరో రెండు రోజులు ఆగితేగానీ ప్రమీల రూ.20 వేలు డ్రా చేసుకోలేని పరిస్థితి. వైద్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా?: ప్రేమ్‌కుమార్ ‘‘నా భార్య ప్రమీలకు ప్రతినెలా డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయటంతోపాటు పైప్ మార్చుకోవాలి. డయాలసిస్ కిట్లకు రూ.20,070, ఇంజెక్షన్‌కు రూ.5 వేలు, రవాణా చార్జీలు మరో రూ.3 వేలు అవుతుంది. మొత్తంగా రూ.30 వేల వరకు అసవరం. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోనివ్వటంలేదు. దీంతో డయాలసిస్‌ను వారుుదా వేసుకోవాల్సి వచ్చింది’’ నా వద్దకు రాలేదు: శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్ వైద్యం కోసం డబ్బులు అవసరమని ప్రమీల తనను సంప్రదించలేదని ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకు అకౌంట్లో నుంచి ఒకరోజు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయాలన్న నిబంధన ఉంది. అయితే వైద్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి ఉంటే ఆ పత్రాలు చూపిస్తే తప్పకుండా సాయం చేసే వాళ్లమని చెప్పారు.