వైద్యుడు మహేష్, ఆస్పత్రి బెడ్డు మీద కిడ్నీరోగి జుత్తిగ పార్థసారథి
పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వైద్యులు డబ్బుమీద అత్యాశతో వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. కిడ్నీ రోగికి ఆపరేషన్ చేస్తూ.. అదనంగా డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడో వైద్యుడు. ఈ సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన జుత్తిగ పార్థసారథి(55) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. నిన్న ఆపరేషన్ చేస్తూ ఉండగా మహేష్ అనే వైద్యుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని రోగి బంధువులు ఆరోపించారు. కిడ్నీలో రాళ్ళ వ్యాధితో గత రెండు రోజుల క్రితం పార్థసారథిని మదర్ వన్నినిలో అతని బంధువులు చేర్పించారు. అయితే ఇక్కడి సిబ్బంది స్కానింగ్, ఇతర పరీక్షల నిమిత్తం ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నిన్న మదర్ వన్నినికి తీసుకొచ్చారు.
అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకు పార్థసారథికి కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరగాల్సి ఉండగా వైద్యుడు మహేష్ ఆలస్యంగా 7.30 గంటలకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాడు. మత్తు ఇచ్చి సగం ఆపరేషన్ అయ్యాక స్టోన్ కిడ్నీ కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని తనకు డబ్బులిస్తే ఇప్పుడే స్టోన్‌ను తొలగిస్తానని లేకుంటే అలానే వదిలేస్తానన్నాడని పేషేంట్ బంధువులు ఆరోపించారు. తాము సొమ్ములిచ్చుకోలేమనడంతో ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారంటూ వారు వాపోయారు. ఈ విషయం ముందే చెప్పాలి గానీ ఆపరేషన్ మధ్యలో చెప్పడమేంటని డాక్టర్‌ను వారు నిలదీశారు. కొద్దిసేపటి తర్వాత వైద్యుడు మహేష్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. దీంతో పేషేంట్ బంధువులు అక్కడి సిబ్బందిని నిలదీసి ఆందోళన నిర్వహించారు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బందికి, పేషేంట్ బంధువులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సొమ్ములకోసం ఆపరేషన్‌ను మధ్యలో వదిలివెళ్లిన డాక్టర్ మహేహ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment