సాక్షి, ఏలూరు: ప్రజల బాగోగుల గురించి కేవలం స్టేట్‌మెంట్‌లకే పరిమితమయ్యే నేతలు ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వెళ్లిన ప్రతీ చోటల్లా జనాలకు దగ్గరగా ఉండడం, బిజీ షెడ్యూల్‌లోనూ వాళ్ల సమస్యలను సావధానంగా వినడం, అప్పటికప్పుడే వాళ్ల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపడం.. నిత్యం చూస్తున్నదే. బహుశా.. ప్రజల సమస్యలను తన పాదయాత్రలో స్వయంగా దగ్గరుండి చూడడమే అందుకు కారణం కాబోలు.
తాజాగా పోలవరం పర్యటనలోనూ ఆయన మానవత్వం ప్రదర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని.. ఆ తల్లికి నేనున్నానమ్మా అంటూ భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ చిన్నారి వైద్య చికిత్స కు హామీ ఇవ్వడంతో పాటు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
కొవ్వూరు మండలం ఔరంగబాద్ గ్రామానికి చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిపి ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు అర్జిని అందచేశారు. ఆ చిన్నారి గురించి తెలుసుకున్నాక ఆయన చలించిపోయారు. తక్షణ ఆర్థిక సహాయం అందించి, తగిన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తల్లికి అన్నగా.. నిస్సికి మేనమామగా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారాయన.
Comments
Please login to add a commentAdd a comment