Child illness
-
చిన్నారి నిస్సి వ్యథ.. చలించిపోయిన సీఎం జగన్
సాక్షి, ఏలూరు: ప్రజల బాగోగుల గురించి కేవలం స్టేట్మెంట్లకే పరిమితమయ్యే నేతలు ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వెళ్లిన ప్రతీ చోటల్లా జనాలకు దగ్గరగా ఉండడం, బిజీ షెడ్యూల్లోనూ వాళ్ల సమస్యలను సావధానంగా వినడం, అప్పటికప్పుడే వాళ్ల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపడం.. నిత్యం చూస్తున్నదే. బహుశా.. ప్రజల సమస్యలను తన పాదయాత్రలో స్వయంగా దగ్గరుండి చూడడమే అందుకు కారణం కాబోలు. తాజాగా పోలవరం పర్యటనలోనూ ఆయన మానవత్వం ప్రదర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని.. ఆ తల్లికి నేనున్నానమ్మా అంటూ భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ చిన్నారి వైద్య చికిత్స కు హామీ ఇవ్వడంతో పాటు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కొవ్వూరు మండలం ఔరంగబాద్ గ్రామానికి చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిపి ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు అర్జిని అందచేశారు. ఆ చిన్నారి గురించి తెలుసుకున్నాక ఆయన చలించిపోయారు. తక్షణ ఆర్థిక సహాయం అందించి, తగిన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తల్లికి అన్నగా.. నిస్సికి మేనమామగా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారాయన. -
తల్లీ.. నేనున్నా
-
పేదింటి బిడ్డకు అరుదైన రోగం.. రూ.16 కోట్ల విదేశీ ఇంజెక్షనే సంజీవని..
మెదక్ జోన్: పేదింటి గిరిజన బిడ్డకు పెద్ద రోగమొచ్చింది. కోట్లాది మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే స్పైనల్ మస్కులర్ అట్రొఫీ (ఎస్ఎంఏ) అనే వెన్నెముకకు సంబంధించిన కండరాల బలహీనత వ్యాధితో ఓ చిన్నారి మూడేళ్లుగా మంచానికి పరిమితమైంది. ఆ చిన్నారి బతకాలంటే అమెరికా నుంచి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను తీసుకురావాలి. దాని ఖరీదు రూ.16 కోట్లపైనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డను బతికించండి అంటూ కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. పుట్టిన 6 నెలల తర్వాత... మెదక్ జిల్లా వాడి పంచాయతీ పరిధిలోని దూప్‌సింగ్ తండాకు చెందిన రేఖ–లక్ష్మణ్ దంపతులకు తొలి సంతానంగా రోజా పుట్టింది. ఆరు నెలల వరకు ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉండేది. ఆ తర్వాత బోర్లా పడే వయసు వచ్చినా పడుకోబెట్టిన చోటే కదలకుండా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను తొలుత మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆ తర్వాత హైదరా బాద్‌లోని నిలోఫర్, నిమ్స్ సహా పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించారు. బాలికను పరీక్షించిన వైద్యులు దీన్ని ఎస్ఎంఏ అనే జన్యుపరమైన వ్యాధిగా తేల్చారు. దీనివల్ల కండరాలు రోజురోజుకూ బలహీనపడి మరణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత వెంటనే అమెరికా నుంచి జన్యు లోపాన్ని సరిదిద్దే ఇంజెక్షన్‌ను తీసుకొస్తేనే వ్యాధిని నయం చేయవచ్చని డాక్టర్లు తేల్చిచెప్పారు. కన్నబిడ్డ కళ్లముందే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే తట్టుకోలేని ఆ పేద తల్లిదండ్రులు నెలకు రూ. 10 వేలు ఖర్చు చేసి తాత్కాలిక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి చికిత్స చేయించారు. తమ బిడ్డకు ఎప్పటికప్పుడు తాత్కాలిక చికిత్స అందించకపోతే ఊపిరి అందదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, జీన్ థెరపీ ద్వారా ఎస్ఎంఏ రోగులకు కొత్త జీవితం ప్రసాదించవచ్చని మెదక్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీసీ శేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇంజెక్షన్ (zolgensma-onasemnogene abeparvovec) అమెరికాలో దొరుకుతుందని, . దాని విలువ రూ. 16 కోట్ల నుంచి 18 కోట్ల మధ్య ఉంటుందని అన్నారు. అమాయకపు చూపుల్లో ఎన్ని ప్రశ్నలో.. మృత్యువుతో పోరాడుతున్న రోజా అమాయకపు చూపులు అందరినీ కలచి వేస్తున్నాయి. అమ్మ ఒడిలో కూర్చొని ఆయాసంగా ఊపిరి తీసుకుంటోంది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ సైగలు చేస్తోంది. చదవండి: Telangana: సచివాలయం కింద చెరువు.. -
పాపం పిల్లలు..
- ప్రసవానంతరం తల్లి మృతి - ఆర్థిక సమస్యలతో తండ్రి ఆత్మహత్య ప్రొద్దుటూరు/ఎర్రగుంట్ల : ప్రసవానంతరం భార్య మృతి చెందడం, పురిటి బిడ్డ అనారోగ్యం పాలవ్వడం చూసి అర్థిక సమస్యల్లో ఉన్న అవిటి వాడైన తాను పిల్లలను పోషించలేననే దిగులుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు.. ఎర్రగుంట్ల మండలం హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దానం, దీనమ్మల రెండవ సంతానం నాగరాజు (27). ఇతనికి కుడి చెయ్యి లేదు. భార్య సువర్ణ(22) వ్యవసాయ కూలీ పనులకెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. వీరికి అశ్వని అనే నాలుగేళ్ల చిన్నారి కలదు. ఈ నేపథ్యంలో సువర్ణ ఈనెల 19న కడప రిమ్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అధిక రక్తస్రావం కారణంగా రెండు రోజుల తర్వాత ఆమె మృతి చెందింది. పురుటిబిడ్డ అనారోగ్యానికి గురవ్వడంతో బంధువులు ఈ నెల 23న ప్రొద్దుటూరులోని గాయత్రి హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి కామెర్లతోపాటు ఇన్ఫెక్షన్ సోకినట్లు డాక్టర్ వీరప్రసాదరెడ్డి తెలిపారు. భార్య చనిపోయిన బాధ ఓ వైపు.. తల్లి లేని పిల్లలను ఎలా సాకాలన్న దిగులు మరో వైపు.. పైగా ఆర్థిక సమస్యలు.. తీవ్రంగా మధన పడిన నాగరాజు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారని తెలుసుకుని ఎర్రగుంట్ల సీఐ కేశవరెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్‌కు సమాచారం అందించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి శివప్రసాదరెడ్డి, ఐసీడీఎస్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరక్టర్ ఆదిలక్షుమ్మలు చిన్నారి చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి వచ్చా రు. ఎర్రగుంట్ల ఎస్ఐ నారాయణ యాదవ్‌తో వీరు చర్చించారు. బిడ్డను వారి బంధువులు దీనమ్మ, సుందరంలు పోషించుకుంటామని చెప్పారని ఎస్ఐ వారితో చెప్పారు. ఈ సందర్భంగా శివప్రసాదరెడ్డి, ఆదిలక్షుమ్మలు మాట్లాడుతూ మృతి చెందిన సువర్ణ, నాగరాజు దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉందని తెలిపారు. ఇద్దరినీ పోషిస్తామని మృతుల బంధువులు రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని, లేదంటే ఆ పిల్లలను తాము కడపలోని శిశు గృహలో చేర్పిస్తామన్నారు. పిల్లల బంధువులతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని ఎస్ఐ వారికి వివరించారు. ఎస్ఐ వెంట ఏఎస్ఐ చంద్రశేఖర్, ప్రాజెక్టు ఆఫీసర్ సునిత ఉన్నారు. అనాథలను చేర్పించండి.. అనాథలుగా ఉన్న చిన్నారులెవరినైనా శిశు గృహలో చేర్పించవచ్చునని జిల్లా బాలల సంరక్షణ అధికారి శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వారికి సరైన పోషణ అందించడంతోపాటు మంచి విద్యను కూడా అందిస్తామన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 8332972561 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.