పాపం పిల్లలు..
- ప్రసవానంతరం తల్లి మృతి
- ఆర్థిక సమస్యలతో తండ్రి ఆత్మహత్య
ప్రొద్దుటూరు/ఎర్రగుంట్ల : ప్రసవానంతరం భార్య మృతి చెందడం, పురిటి బిడ్డ అనారోగ్యం పాలవ్వడం చూసి అర్థిక సమస్యల్లో ఉన్న అవిటి వాడైన తాను పిల్లలను పోషించలేననే దిగులుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు.. ఎర్రగుంట్ల మండలం హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దానం, దీనమ్మల రెండవ సంతానం నాగరాజు (27). ఇతనికి కుడి చెయ్యి లేదు. భార్య సువర్ణ(22) వ్యవసాయ కూలీ పనులకెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. వీరికి అశ్వని అనే నాలుగేళ్ల చిన్నారి కలదు.
ఈ నేపథ్యంలో సువర్ణ ఈనెల 19న కడప రిమ్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అధిక రక్తస్రావం కారణంగా రెండు రోజుల తర్వాత ఆమె మృతి చెందింది. పురుటిబిడ్డ అనారోగ్యానికి గురవ్వడంతో బంధువులు ఈ నెల 23న ప్రొద్దుటూరులోని గాయత్రి హాస్పిటల్‌లో చేర్పించారు. చిన్నారికి కామెర్లతోపాటు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు డాక్టర్ వీరప్రసాదరెడ్డి తెలిపారు. భార్య చనిపోయిన బాధ ఓ వైపు.. తల్లి లేని పిల్లలను ఎలా సాకాలన్న దిగులు మరో వైపు.. పైగా ఆర్థిక సమస్యలు.. తీవ్రంగా మధన పడిన నాగరాజు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారని తెలుసుకుని ఎర్రగుంట్ల సీఐ కేశవరెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్‌కు సమాచారం అందించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి శివప్రసాదరెడ్డి, ఐసీడీఎస్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరక్టర్ ఆదిలక్షుమ్మలు చిన్నారి చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి వచ్చా రు. ఎర్రగుంట్ల ఎస్‌ఐ నారాయణ యాదవ్‌తో వీరు చర్చించారు. బిడ్డను వారి బంధువులు దీనమ్మ, సుందరంలు పోషించుకుంటామని చెప్పారని ఎస్‌ఐ వారితో చెప్పారు.
ఈ సందర్భంగా శివప్రసాదరెడ్డి, ఆదిలక్షుమ్మలు మాట్లాడుతూ మృతి చెందిన సువర్ణ, నాగరాజు దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉందని తెలిపారు. ఇద్దరినీ పోషిస్తామని మృతుల బంధువులు రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని, లేదంటే ఆ పిల్లలను తాము కడపలోని శిశు గృహలో చేర్పిస్తామన్నారు. పిల్లల బంధువులతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని ఎస్‌ఐ వారికి వివరించారు. ఎస్‌ఐ వెంట ఏఎస్‌ఐ చంద్రశేఖర్, ప్రాజెక్టు ఆఫీసర్ సునిత ఉన్నారు.
అనాథలను చేర్పించండి..
అనాథలుగా ఉన్న చిన్నారులెవరినైనా శిశు గృహలో చేర్పించవచ్చునని జిల్లా బాలల సంరక్షణ అధికారి శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వారికి సరైన పోషణ అందించడంతోపాటు మంచి విద్యను కూడా అందిస్తామన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 8332972561 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.