
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): ఉన్నత హోదా లో ఉండి..అంతే హుందాగా, ఎంతో ఉన్నతంగా, మనస్సున్న మారాజుల మాదిరి స్పందిస్తూ ఈ ఆపత్కాలంలో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ), మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్. కరోనాతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకు అయినవారే భయపడుతున్న వేళ.. మేమున్నామంటూ వచ్చి అన్నీ జరిపిస్తున్నారు. ఇల్లెందు చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గతేడాది కాలంనుంచి ఇదే తరహాలో పలు కుంటుంబాలకు బాసటగా నిలిచారు. సోమవా రం ఇల్లెందు పట్టణంలోని 22వ వార్డులో శంకరమ్మ(55)అనే మహిళ కరోనాతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ డీవీ వార్డు కౌన్సిలర్ అంకెపాక నవీన్, సయ్యద్ ఆజంతో కలిసి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారే స్వయంగా దహన సంస్కారం చేయించారు. పట్టణ మొదటి పౌరుడిగా ఆయన స్వయంగా పాల్గొంటుండటం, ఆ కుటుంబాలకు అండగా నిలుస్తుండటం పట్ల చైర్మన్ డీవీ సేవాగుణాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
నేనున్నానంటున్న నాగ ప్రసాద్
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన ఎం.సంపత్‌కుమార్(38)కోవిడ్ కారణంగా ఖమ్మంలోని ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్‌లు కలిసి ప్రత్యేక పీపీ కిట్లు ధరించి తన మున్సిపల్ సిబ్బందితో కలిసి దహన సంస్కారాలు జరిపించారు. ఇటీవల సుందరయ్యనగర్‌లో ఒకరు కరోనాతో మృతి చెందగా..మున్సిపల్ కమిషనరే దగ్గరుండి తుది వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment