దండించడానికీ అర్హత ఉండాలి!
బిషప్ పాటర్ ఒక ప్రయాణికుల నౌకలో యూరోప్ వెళ్తున్నాడు. ఆయనకూ ఒక అపరిచితునికీ కలిపి ఒక కేబిన్ ఇచ్చారు. బిషప్‌కు అతను మంచివాడు కాడనిపించింది. కెప్టెన్ వద్దకు వెళ్లి, నా బంగారు గొలుసు, ఖరీదైన వాచీ మీ వద్ద పెట్టొచ్చా? అనడిగాడు. ‘‘తప్పకుండా! కాని మీ కేబిన్ సహచరుడు కూడా ఇందాకే వచ్చి తన ఖరీదైన వస్తువులు నాకిచ్చి వెళ్లాడు’ అన్నాడా కెప్టెన్.
వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని యూదు మత పెద్దలు యేసు వద్దకు తెచ్చి, ధర్మశాస్త్రప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలా? లేక నీ బోధ ప్రకారం క్షమించి వదిలేయాలా? అనడిగారు (యోహాను 8:7). చంపమంటే, మరి క్షమాపణకు సంబంధించిన నీ బోధలన్నీ వట్టి మాటలేనా? అనాలని, క్షమించమంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించావని నేరారోపణ చేయాలని వారి పన్నాగం. అయితే యేసు వాళ్ల చెంప ఛెళ్లుమనిపించే జవాబిచ్చాడు. ‘ఆమెను రాళ్లతో కొట్టి చంపండి. కాని ఎన్నడూ పాపం చేయని వాడే మొదటి రాయి వేయాలి’ అన్నాడాయన. పాపిని, క్షమాపణ పొంది సంస్కరించబడినప్పుడు విడుదలయ్యే ‘ప్రగతిశీల శక్తి’ ఎంత గొప్పదో యేసు రుచి చూపించాడు.
వ్యభిచారం చేసిన స్త్రీయే పాపాత్మురాలన్న భావనతో ఉన్న ఆనాటి ప్రజలకు, ఆమెను చంపేందుకు చేతుల్లో రాళ్లతో వచ్చిన వాళ్ల సభ్యతా ముసుగు వెనుక దాక్కున్న ‘క్రూర పాప స్వభావాన్ని’ ఆయన బట్టబయలు చేశాడు. వాళ్ల ‘నటన’ లేదా ‘వేషధారణ’ ఆమె వ్యభిచారం కన్నా ఘోరమైన పాపమన్నాడు ప్రభువు. లోకానికి మంచివారు, చెడ్డవారు అనే రెండు తెగలే తెలుసు.
కాని పైకి ఎంతో మంచిగా, హుందాగా కనిపించేవారు ఆంతర్యంలో ఎంత హీనంగా, అసహ్యంగా ఉంటారో, వాళ్లెంత దుర్మార్గులో యేసు రుజువు చేశాడు. సమాజంలో నిజమైన సమస్యలు చెడ్డవారితో కాదు, పైకి కనిపించని దుర్మార్గతతో జీవించే వాళ్లే లోలోపల సమాజాన్ని చెదపురుగుల్లాగా తినేస్తూ డొల్ల చేస్తుంటారు. అందుకే పాపిని శిక్షించాలి, కాని ఎన్నడూ పాపం చేయని వారు మాత్రమే ఆ శిక్ష విధించాలని మానవ చరిత్రలోనే మొదటిసారిగా యేసుక్రీస్తు చట్టానికి అద్భుతమైన విశ్లేషణనిచ్చాడు.
నీ కంట్లో దూలముండగా అవతలి వ్యక్తి కంట్లోని నలుసునెందుకు ఎత్తి చూపిస్తావని యేసు ఒకసారి హెచ్చరించారు, కొందరుంటారు, తాము అణువంత కూడా మారరు కాని అవతలి వాళ్లను... వీలైతే లోకాన్నంతటినీ మార్చేయాలన్న దురద కలిగిన వ్యసనపరులు వాళ్లు. తమ ఉచిత సలహాలు, పాండిత్య ప్రతిభతో లోకాన్నంతా మార్చగల బలవంతులమనుకుంటారు కాని తమకు తాము బాగు చేసుకోలేని బలహీనులు వాళ్లు. అందుకే యేసు గజదొంగలను, వ్యభిచారులను, శత్రువులను క్షమించాడు. కాని పైకొకటి లోపల ఒకటిగా ఉండే పగటి వేషగాళ్లను చీల్చి చెండాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్