Dr. T. A. Prabhu Kiran
-
జక్కయ్యకు వరమైన ఒకరోజు!
రేపటికోసం సంపాదించే ప్రయాసలో ఈరోజు జీవించడం మర్చిపోయిన అభాగ్యుడు యెరికో వాసి జక్కయ్య. అనైతికత, అపరిశుద్ధత, స్వార్థం, దురాశతో కూడిన అతని ‘ప్రతిదినం’ అపరాధ భావనతో నిండిన ‘గతం’గా మారి అతను మోయలేని బరువుగా గుదిబండగా మారింది. అలా వానికి బందీగా రేపటికోసం నేటిని మూల్యంగా చెల్లించే నిస్సహాయ బాటసారిగా సాగిన అతని జీవితం అపజయాలుకు చిరునామా అయింది. ఎంతో ఆనందానికి, ఎన్నో ఆత్మీయాశీర్వాదాలకు, మనశ్శాంతికి, పవిత్రతకు, పరోపకార కార్యాలకు కేంద్రంగా ఉండాల్సిన తన జీవితాన్ని జక్కయ్య అలా నిర్వీర్యం చేసుకున్నాడు. రేపటి ఎండమావుల్ని వెంటాడుతూ, నిన్నటి బరువులు మోస్తూ, నేటి ఆనందాన్ని అనుభవించలేకపోతున్న ఇప్పటితరానికి రెండువేల ఏళ్ల క్రితమే జక్కయ్య ప్రతినిధి అయ్యాడు. అయితే అలా కృంగిపోయి, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న జక్కయ్యను యేసుప్రభువు ఒకరోజు సందర్శించి అతన్ని సంధించాడు. అంతదాకా వాళ్లిద్దరికీ ముఖపరిచయం లేకున్నా, ఎన్నాళ్లనుండో తానెరిగిన స్నేహితుడిలాగా పరామర్శించి, నేడు నీ ఇంట్లో బస చేస్తానని తెలిపి, అతని జీవితంలో అంతకాలంగా లేని నేటి’ని ఆవిష్కరించాడు. అంతటి రక్షకునికి బస చేసేందుకు పాపిౖయెన ఈ జక్కయ్య ఇల్లే దొరికిందా? అనుకుంటూ ముక్కున వేలేసుకున్న అక్కడి జనంతో ‘‘ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. ఎందుకంటే, ‘నేడు’ ఇతని ఇంటికి రక్షణ వచ్చింది’’ అంటూ ప్రభువు మరో నేటిని అతనికి బహుమానంగా ఇచ్చాడు. దైవిక సంకల్పాన్నెరిగి, దైవిక సాయంతో జీవించగలిగితే ఈ రోజుకున్న బలం అనూహ్యమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఈరోజు’ను మసకబారనీయవద్దు, నిర్వీర్యం చేసుకోవద్దు. ఇతను పాపి, లోభి అంటూ ముద్రవేసిన ఆనాటి ప్రజలందరి సమక్షంలో ‘యేసు’ ఉద్ఘాటనతో జక్కయ్య అబ్రాహాము కుమారుడు గాకా, ఇకనుండి నేను నాకున్నదంతా పేదలకిస్తానని ప్రకటించడం ద్వారా ఆ ప్రజలకే అతను మిత్రుడు, పరోపకారి అయ్యాడు. జీవంగల దేవుని సైన్యాన్ని ఓడించడానికి సన్నతిలేని ఈ ఫిలిప్పీయుడెంత? అని దావీదు డొల్లతనంతో తలపడేందుకు సవాలు స్వీకరించిన ఒకరోజు, ఆకలితో కరకరలాడుతున్న సింహాలను దేవుని పేరిట దానియేలు ఎదుర్కొన్న ఒకరోజు, తనకున్న రెండు కాసులూ దేవునికిచ్చి ఆయనతోనే గొప్పదాతగా శ్లాఘించబడ్డ ఒక పేద విధవరాలి జీవితంలోని ఒకరోజు, ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాలి. అదే చరిత్రను మార్చుతుంది. మానవాళికే వరమవుతుంది. జీవితాన్ని వ్యర్థపరచుకునేందుకు వెయ్యి సాకులు దొరుకుతాయి. కాని జీవన సాఫల్యానికి ఒకే ఒక కారణముంటుంది. అదే దేవుడు మనల్ని దర్శించడం మాత్రం ఆయనకు తలవంచిన ఒక రోజు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని కాడి సులువు
స్వాభిమానం, స్వయంకృషి, స్వాతంత్య్రం... ఇవి కదా ఆధునిక సమాజంలో వినిపించే మాటలు. పాజిటివ్ ఆలోచనా సరళిని గురించి దాని ప్రభావానికి సంబంధించిన వాదనలు, దృకృథాలు వినబడని రోజే లేదు. ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా ఇతరులతో సంబంధం లేకుండా బతకడమే ఆధునికతగా మారింది. అది ఏ సమాజమైనా, యుగమైనా, కాలమైనా, ఎంత గొప్పగా జీవించినా, జీవితానికి సంబంధించిన ‘అకౌంట్’ అంతా దేవునికి అప్పగించే రోజు ఒకటుంటుందని, దాన్నే తీర్పు దినమంటారని బైబిలు చెబుతుంది (ప్రసంగి 11:9). అనుకున్నది సాధించడమే ధ్యేయంగా, అంచెలంచెలుగా పైకి ఎగబాకడమే విజయ చిహ్నంగా, అంతా భావిస్తున్న నేటి తరంలో ‘పైన దేవుడున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు’ అని చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అదేదో పాతచింతకాయ పచ్చడి సిద్ధాంతమంటూ తేలిగ్గా కొట్టేసే అవకాశాలే ఎక్కువ. దేవుడు లేకుండా జీవించగలమన్న ధీమా ఉంటే మంచిదే! కాని అందుకు అవసరమైనదానికన్నా ఎక్కువగా ‘స్వీయజ్ఞానం’ మీద ఆధారపడవలసి ఉంటుంది. అది ప్రమాదమే!’ దేవుడున్నాడు సుమా! అనేది ఒక బెదిరింపు కాదు, హెచ్చరిక అసలే కాదు. ఆదరణతో కూడిన స్పష్టీకరణ అది. పెరిగే జ్ఞానంతో, విశృంఖలత్వంగా వెర్రితలలు వేస్తున్న స్వేచ్ఛా ధోరణులతో సమాజానికేమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. మద్యానికి, లైగింక విశృంఖలత్వానికి, నేరప్రవృత్తికి, మాదకద్రవ్యాలకు బానిసలైన తరాన్ని అది పెంచి పోషిస్తోంది. పెద్ద జీతం గొప్ప జీవితాన్నిస్తుందనుకుంటే, పరుపు మెత్తదనం గాఢనిద్రనిస్తుందనుకుంటే, విశాలమైన భవనంలో సుఖశాంతులుంటాయనుకుంటే, అందం జీవితానికి సౌశీల్యాన్నిస్తుందనుకుంటే, ఇవే కదా ఎండమావుల భ్రమలంటే!! ఎంత ప్రయాసపడ్డా, బయట ఎంతకాలమున్నా చీకటి వేళకు సొంతగూటికి చేరుకోవలసిందే! వైఫల్యాలు, కన్నీళ్ళు, అవమానాలు, అన్యాయాలన్నీ సహించి బలహీనపడ్డాక సేదతీరేది మాత్రం దేవుని ఒడిలోనే! ప్రయాసపడి భారం మోసే సమస్త జనులకు ఆయనిచ్చే ‘విశ్రాంతి’ని పొందడమంటే, మండుటెండలో దప్పికతో అలమటిస్తున్న బాటసారికి చల్లటి, తియ్యటి మంచినీళ్ళు దొరకటమే! ప్రతివ్యక్తి జీవితంలో ఏదో ఒక కాడి మోయక తప్పదు. కాని సాత్వికుడు, దీన మనస్సుగలవాడైన దేవుడిచ్చే కాడి సులువైనది, తేలికైనది అని బైబిలు చెబుతోంది (మత్తయి 11:28–30). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవ జ్ఞానముంటే సరిపోదు... దేవుడుండాలి!
తప్పిపోయిన తమ ఆరేళ్ల కొడుకు కోసం ఆ దంపతులు పిచ్చివాళ్లలా బజారంతా వెదుకుతున్నారు. గట్టిగట్టిగా వాడి పేరు పిలుస్తున్నారు. కిడ్నాప్ అయ్యాడేమోనని గజగజలాడుతున్నారు. కొద్దిసేపటికి ఒక ఐస్‌క్రీమ్ షాప్‌లో తాపీగా ఐస్‌క్రీమ్ తింటూ కనిపించాడు వాడు. ఎవరో కొనిచ్చాడు వాడికి. ఐస్‌క్రీమ్ అంటే వాడికెంతో ఇష్టం. దాంతో తల్లిదండ్రుల్ని వదిలి ఆ షాప్‌లోకి వెళ్లాడు. కాని తాను తప్పిపోతున్నానని వాడు గ్రహించలేదు. నికొదేము అనే యూదు పరిసయ్యుడు ఒక అర్ధరాత్రి యేసుక్రీస్తును కలుసుకొని మాట్లాడాడు. అతని ధర్మసంశయాలన్నింటికి జవాబుగా ‘నీవు కొత్తగా జన్మించాలి’ అన్నాడు యేసు! ‘అంటే నేను మళ్లీ నా తల్లి గర్భంలోకి ప్రవేశించాలా?’ అనడిగాడు నికొదేము అమాయకంగా. అందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించే నికొదేముకు తాను ధర్మమార్గం నుండి తప్పిపోయానన్న విషయం తెలియదని ప్రభువుకర్థమైంది. కనబడని గాలిని దాని శబ్దం, చెట్టు కొమ్మల కదలికను బట్టి గుర్తు పట్టినట్టే, ‘నూతనజన్మం’ కూడా అగోచరమైన ఆత్మీయ పరిణామమని, విశ్వాసిలో వచ్చే పరివర్తనం, ఆత్మీయ ఎదుగుదల, పెనుమార్పుల ద్వారా దాన్ని తెలుసుకుంటామని ప్రభువు వివరించాడు. పైగా పరలోకం నుండి వీచిన గాలి వంటిదే దైవకుమారుని రాక అని, ఆయన బోధలు, సూచకక్రియలు, జీవితం ద్వారా ఆయనే రక్షకుడని గ్రహించి ఆయన్ని స్వీకరించడమే ‘నూతన జన్మ’మని తద్వారానే నిత్యజీవితం లభ్యమవుతుందని యేసు ఎంతో నర్మగర్భంగా వివరించాడు (యోహాను 3:1–21). ఎంతో సంక్లిష్టమైన అంశాలను కూడా అత్యంత సరళంగా వివరించే ప్రభువు నికొదేముతో ఎంతో మర్మయుక్తంగా, లోతుగా మాట్లాడాడు. బహుశా అతడు పండితుడన్న గౌరవంతో కావచ్చు. కాని యేసు మాటలేవీ అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే అతనికి ధర్మశాస్త్ర పాండిత్యముంది, దైవ నియమావళి విధి విధానాలు తెలుసు. అతనికి దేవుని గురించి తెలుసు కాని దేవుడు తెలియదు. దేవుని మార్గంలో ఉన్నాననుకొంటున్నాడు కాని తప్పిపోయి దేవునికి దూరమైపోయాడన్న విషయం నికొదేముకు తెలియదు. లేకపోతే నిత్యజీవాన్నివ్వగలిగిన రక్షకుడైన యేసును వదిలి ఆ ర్రాతి ఖాళీ చేతులతో వెళ్లిపోయేవాడు కాదు. అతని చుట్టే కాదు, అతని ఆంతర్యం నిండా చీకటి ఉంది. అతని మెదడు నిండా దైవజ్ఞానముంది, గుండెలో మాత్రం దేవుడు లేని వెలితి ఉంది. ‘నీవెంత? నిన్ను మోసేది, భరించేది నేనే కదా?’ అన్నదట ఒక కరెంటు స్తంభం, ఒక కరెంటు తీగతో. ‘కావచ్చు, కాని కరెంటుండేది నాలోనే కాని నీలోకాదు కదా! అన్నదట తీగ సగర్వంగా. కరెంటు తీగను మోసే స్తంభంలో కరెంటు లేనట్టే దేవుని పిల్లలం, పరిచాలకులమని చెప్పుకునే చాలామందిలో దేవుడు లేకపోవడమే ఈనాటి ప్రధాన సమస్య. దేవుని గురించి తెలుసుకుంటే సరిపోదు, ఆ దేవుని కలిగి ఉంటేనే ఆయన శక్తి మనదవుతుంది. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దండించడానికీ అర్హత ఉండాలి!
బిషప్ పాటర్ ఒక ప్రయాణికుల నౌకలో యూరోప్ వెళ్తున్నాడు. ఆయనకూ ఒక అపరిచితునికీ కలిపి ఒక కేబిన్ ఇచ్చారు. బిషప్కు అతను మంచివాడు కాడనిపించింది. కెప్టెన్ వద్దకు వెళ్లి, నా బంగారు గొలుసు, ఖరీదైన వాచీ మీ వద్ద పెట్టొచ్చా? అనడిగాడు. ‘‘తప్పకుండా! కాని మీ కేబిన్ సహచరుడు కూడా ఇందాకే వచ్చి తన ఖరీదైన వస్తువులు నాకిచ్చి వెళ్లాడు’ అన్నాడా కెప్టెన్. వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని యూదు మత పెద్దలు యేసు వద్దకు తెచ్చి, ధర్మశాస్త్రప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలా? లేక నీ బోధ ప్రకారం క్షమించి వదిలేయాలా? అనడిగారు (యోహాను 8:7). చంపమంటే, మరి క్షమాపణకు సంబంధించిన నీ బోధలన్నీ వట్టి మాటలేనా? అనాలని, క్షమించమంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించావని నేరారోపణ చేయాలని వారి పన్నాగం. అయితే యేసు వాళ్ల చెంప ఛెళ్లుమనిపించే జవాబిచ్చాడు. ‘ఆమెను రాళ్లతో కొట్టి చంపండి. కాని ఎన్నడూ పాపం చేయని వాడే మొదటి రాయి వేయాలి’ అన్నాడాయన. పాపిని, క్షమాపణ పొంది సంస్కరించబడినప్పుడు విడుదలయ్యే ‘ప్రగతిశీల శక్తి’ ఎంత గొప్పదో యేసు రుచి చూపించాడు. వ్యభిచారం చేసిన స్త్రీయే పాపాత్మురాలన్న భావనతో ఉన్న ఆనాటి ప్రజలకు, ఆమెను చంపేందుకు చేతుల్లో రాళ్లతో వచ్చిన వాళ్ల సభ్యతా ముసుగు వెనుక దాక్కున్న ‘క్రూర పాప స్వభావాన్ని’ ఆయన బట్టబయలు చేశాడు. వాళ్ల ‘నటన’ లేదా ‘వేషధారణ’ ఆమె వ్యభిచారం కన్నా ఘోరమైన పాపమన్నాడు ప్రభువు. లోకానికి మంచివారు, చెడ్డవారు అనే రెండు తెగలే తెలుసు. కాని పైకి ఎంతో మంచిగా, హుందాగా కనిపించేవారు ఆంతర్యంలో ఎంత హీనంగా, అసహ్యంగా ఉంటారో, వాళ్లెంత దుర్మార్గులో యేసు రుజువు చేశాడు. సమాజంలో నిజమైన సమస్యలు చెడ్డవారితో కాదు, పైకి కనిపించని దుర్మార్గతతో జీవించే వాళ్లే లోలోపల సమాజాన్ని చెదపురుగుల్లాగా తినేస్తూ డొల్ల చేస్తుంటారు. అందుకే పాపిని శిక్షించాలి, కాని ఎన్నడూ పాపం చేయని వారు మాత్రమే ఆ శిక్ష విధించాలని మానవ చరిత్రలోనే మొదటిసారిగా యేసుక్రీస్తు చట్టానికి అద్భుతమైన విశ్లేషణనిచ్చాడు. నీ కంట్లో దూలముండగా అవతలి వ్యక్తి కంట్లోని నలుసునెందుకు ఎత్తి చూపిస్తావని యేసు ఒకసారి హెచ్చరించారు, కొందరుంటారు, తాము అణువంత కూడా మారరు కాని అవతలి వాళ్లను... వీలైతే లోకాన్నంతటినీ మార్చేయాలన్న దురద కలిగిన వ్యసనపరులు వాళ్లు. తమ ఉచిత సలహాలు, పాండిత్య ప్రతిభతో లోకాన్నంతా మార్చగల బలవంతులమనుకుంటారు కాని తమకు తాము బాగు చేసుకోలేని బలహీనులు వాళ్లు. అందుకే యేసు గజదొంగలను, వ్యభిచారులను, శత్రువులను క్షమించాడు. కాని పైకొకటి లోపల ఒకటిగా ఉండే పగటి వేషగాళ్లను చీల్చి చెండాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్