దైవ జ్ఞానముంటే సరిపోదు... దేవుడుండాలి!
తప్పిపోయిన తమ ఆరేళ్ల కొడుకు కోసం ఆ దంపతులు పిచ్చివాళ్లలా బజారంతా వెదుకుతున్నారు. గట్టిగట్టిగా వాడి పేరు పిలుస్తున్నారు. కిడ్నాప్ అయ్యాడేమోనని గజగజలాడుతున్నారు. కొద్దిసేపటికి ఒక ఐస్‌క్రీమ్ షాప్‌లో తాపీగా ఐస్‌క్రీమ్ తింటూ కనిపించాడు వాడు. ఎవరో కొనిచ్చాడు వాడికి. ఐస్‌క్రీమ్ అంటే వాడికెంతో ఇష్టం. దాంతో తల్లిదండ్రుల్ని వదిలి ఆ షాప్‌లోకి వెళ్లాడు. కాని తాను తప్పిపోతున్నానని వాడు గ్రహించలేదు.
నికొదేము అనే యూదు పరిసయ్యుడు ఒక అర్ధరాత్రి యేసుక్రీస్తును కలుసుకొని మాట్లాడాడు. అతని ధర్మసంశయాలన్నింటికి జవాబుగా ‘నీవు కొత్తగా జన్మించాలి’ అన్నాడు యేసు! ‘అంటే నేను మళ్లీ నా తల్లి గర్భంలోకి ప్రవేశించాలా?’ అనడిగాడు నికొదేము అమాయకంగా. అందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించే నికొదేముకు తాను ధర్మమార్గం నుండి తప్పిపోయానన్న విషయం తెలియదని ప్రభువుకర్థమైంది.
కనబడని గాలిని దాని శబ్దం, చెట్టు కొమ్మల కదలికను బట్టి గుర్తు పట్టినట్టే, ‘నూతనజన్మం’ కూడా అగోచరమైన ఆత్మీయ పరిణామమని, విశ్వాసిలో వచ్చే పరివర్తనం, ఆత్మీయ ఎదుగుదల, పెనుమార్పుల ద్వారా దాన్ని తెలుసుకుంటామని ప్రభువు వివరించాడు. పైగా పరలోకం నుండి వీచిన గాలి వంటిదే దైవకుమారుని రాక అని, ఆయన బోధలు, సూచకక్రియలు, జీవితం ద్వారా ఆయనే రక్షకుడని గ్రహించి ఆయన్ని స్వీకరించడమే ‘నూతన జన్మ’మని తద్వారానే నిత్యజీవితం లభ్యమవుతుందని యేసు ఎంతో నర్మగర్భంగా వివరించాడు (యోహాను 3:1–21).
ఎంతో సంక్లిష్టమైన అంశాలను కూడా అత్యంత సరళంగా వివరించే ప్రభువు నికొదేముతో ఎంతో మర్మయుక్తంగా, లోతుగా మాట్లాడాడు. బహుశా అతడు పండితుడన్న గౌరవంతో కావచ్చు. కాని యేసు మాటలేవీ అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే అతనికి ధర్మశాస్త్ర పాండిత్యముంది, దైవ నియమావళి విధి విధానాలు తెలుసు. అతనికి దేవుని గురించి తెలుసు కాని దేవుడు తెలియదు. దేవుని మార్గంలో ఉన్నాననుకొంటున్నాడు కాని తప్పిపోయి దేవునికి దూరమైపోయాడన్న విషయం నికొదేముకు తెలియదు. లేకపోతే నిత్యజీవాన్నివ్వగలిగిన రక్షకుడైన యేసును వదిలి ఆ ర్రాతి ఖాళీ చేతులతో వెళ్లిపోయేవాడు కాదు. అతని చుట్టే కాదు, అతని ఆంతర్యం నిండా చీకటి ఉంది.
అతని మెదడు నిండా దైవజ్ఞానముంది, గుండెలో మాత్రం దేవుడు లేని వెలితి ఉంది. ‘నీవెంత? నిన్ను మోసేది, భరించేది నేనే కదా?’ అన్నదట ఒక కరెంటు స్తంభం, ఒక కరెంటు తీగతో. ‘కావచ్చు, కాని కరెంటుండేది నాలోనే కాని నీలోకాదు కదా! అన్నదట తీగ సగర్వంగా. కరెంటు తీగను మోసే స్తంభంలో కరెంటు లేనట్టే దేవుని పిల్లలం, పరిచాలకులమని చెప్పుకునే చాలామందిలో దేవుడు లేకపోవడమే ఈనాటి ప్రధాన సమస్య. దేవుని గురించి తెలుసుకుంటే సరిపోదు, ఆ దేవుని కలిగి ఉంటేనే ఆయన శక్తి మనదవుతుంది.
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్